November 11, 2026
Explore
గంజాయి అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

గంజాయి అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

November 11, 2026 | Andhra Pradesh

– 1,100 గ్రాముల గంజాయి స్వాధీనం.

  • గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా.
  • తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు పోలీసుల తనిఖీలు.
  • అక్కుర్తి రైల్వే గేటు వద్ద శ్రీకాళహస్తి రూరల్ పోలీసుల దాడి.
  • నిందితుడి వద్ద నుంచి 1,100 గ్రాముల గంజాయి, సెల్‌ఫోన్, మోటార్ సైకిల్ స్వాధీనం.
  • గంజాయి సరఫరా చేస్తున్న ఇతర వ్యక్తుల గుర్తింపునకు కొనసాగుతున్న దర్యాప్తు.

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు మరియు వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసు అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో 11.11.2026 తేదీ ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి రైల్వే గేటు వద్ద గంజాయి అక్రమ విక్రయాలకు సంబంధించి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు శ్రీకాళహస్తి రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. ఇబ్రహీం తన సిబ్బంది, రెవెన్యూ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలలో గంజాయి కలిగి ఉన్న ముచ్చువోలు గ్రామానికి చెందిన బర్రి మోహన్ రెడ్డి, తండ్రి మాధవరెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు 1,100 గ్రాముల గంజాయి, ఒక సెల్‌ఫోన్, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.

ప్రాథమిక విచారణలో నిందితుడు ఒడిశా రాష్ట్రంలోని ఛత్రపూర్ పట్టణానికి చెందిన శీను అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయిని తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్‌లో NDPS చట్టం సెక్షన్ 8(c) r/w 20(b)(ii)(B) ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న ప్రధాన వ్యక్తితో పాటు ఈ అక్రమ కార్యకలాపాల్లో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి. వాటి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రజలకు ఎక్కడైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 112 కు తెలియజేయాలి. మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని తిరుపతి జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Tags;Individual arrested for the illegal sale of ganja (cannabis)