తిరుమల ముచ్చట్లు:
టీటీడీ అభిప్రాయ సేకరణ వ్యవస్థ పనితీరు, భక్తుల నుంచి అందుతున్న అభిప్రాయాలు, ఫిర్యాదుల పరిష్కారంపై బుధవారం ఉదయం టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు టీటీడీ సేవలపై భక్తుల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సేకరించి, వాటి ఆధారంగా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్నప్రసాదం కేంద్రంలో భక్తులకు అవసరమైన సమాచారం అందించేందుకు రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని సూచించారు. నీటి పొదుపు, విద్యుత్ పొదుపుపై భక్తులకు అవగాహన కల్పిస్తూ, వనరులు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
వసతి సముదాయాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలతో పాటు పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. నందకం యాప్ పనితీరును ప్రతిరోజూ నిరంతరం పర్యవేక్షించాలని, యాప్‌లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే 24 గంటల్లోపు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లగేజీ కౌంటర్ల వద్ద భక్తుల భద్రత, సౌకర్యాల దృష్ట్యా సీసీటీవీ కెమెరాలు, ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయాలని సూచించారు.భక్తుల అభిప్రాయాలు, సూచనలను ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుంటూ టీటీడీ సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు ఈవో తెలిపారు.ఈ సమావేశంలో వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.
Tags: Additional EO reviews TTD’s feedback collection system