- 2017లో పాత కక్షలు, కుటుంబ కలహాల నేపథ్యంలో అన్నను కర్రతో కొట్టి హత్య చేసిన కేసులో నిందితుడికి శిక్ష.
- రూ.15,000 జరిమానా విధిస్తూ గూడూరు 7వ అదనపు జిల్లా న్యాయస్థానం తీర్పు.
- నాణ్యమైన దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాల సేకరణతో నేరం రుజువు.
- గుడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా కేసు విచారణపై నిరంతర పర్యవేక్షణ.
- కేసులో సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ గారు.
తిరుపతిముచ్చట్లు:
2017 జూన్ 04వ తేదీన డక్కిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగనపల్లి గ్రామం ఎస్టీ కాలనీలో పాత కక్షలు, కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన హత్య కేసులో నిందితుడికి గౌరవ 7వ అదనపు జిల్లా న్యాయస్థానం, గూడూరు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.15,000 జరిమానా విధించింది.
ఈ కేసులో నిందితుడు శనగా శ్రీరాములు తనకు వరుసకు అన్న అయిన శనగా అంకయ్యతో ఉన్న పాత కక్షల నేపథ్యంలో, హత్య చేయాలనే ఉద్దేశంతో కర్రతో అతని తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన అంకయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య శనగా రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డక్కిలి పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేశారు.
అప్పటి డక్కిలి ఎస్ఐ శ్రీ కె. మరిడి నాయుడు ప్రాథమిక దర్యాప్తు చేపట్టగా, అనంతరం అప్పటి వెంకటగిరి సీఐ శ్రీ ఎం. శ్రీనివాసరావు సమగ్రంగా దర్యాప్తు చేసి, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర కీలక ఆధారాలను సేకరించి నిందితుడిపై చార్జిషీట్ దాఖలు చేశారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు నాయుడుపేట డీఎస్పీ జి. చెంచుబాబు మార్గదర్శకత్వంలో ఈ కేసును గుడ్ ట్రయల్ మానిటరింగ్‌లో భాగంగా నిరంతరం పర్యవేక్షించారు. ముఖ్యమైన సాక్షులను సకాలంలో న్యాయస్థానానికి హాజరుపరచడం, కేసు విచారణ పురోగతిని సమీక్షించడం, ప్రాసిక్యూషన్‌తో సమన్వయం చేయడం ద్వారా పోలీసులు సమర్థవంతంగా వ్యవహరించారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన గౌరవ 7వ అదనపు జిల్లా న్యాయస్థానం, గూడూరు న్యాయాధికారి కె. వెంకట నాగ పవన్ 06.11.2026న నిందితుడు శనగా శ్రీరాములుపై నేరం రుజువైనట్లు నిర్ధారించి జీవిత ఖైదుతో పాటు రూ.15,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
నిందితుడి వివరాలు:
శనగా శ్రీరాములు, తండ్రి వెంకటసుబ్బయ్య, వయస్సు 40 సంవత్సరాలు, ఎస్టీ కాలనీ, సంగనపల్లి గ్రామం, డక్కిలి మండలం.
మృతుడి వివరాలు:
శనగా అంకయ్య, తండ్రి లేట్ చెంచయ్య, వయస్సు 44 సంవత్సరాలు, ఎస్టీ కాలనీ, సంగనపల్లి గ్రామం, డక్కిలి మండలం.
కేసులో సమర్థవంతంగా వాదించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ కొత్తపల్లి వసంత కుమార్, సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరచడంతో పాటు విచారణను పర్యవేక్షించిన వెంకటగిరి సీఐ ఎం. రోశయ్య, సమగ్ర దర్యాప్తు చేపట్టిన సీఐ ఎం. శ్రీనివాసరావు, కోర్టు లైజన్ ఆఫీసర్ డి. మల్లికార్జున, కోర్టు కానిస్టేబుల్ కె. రామకృష్ణలను నాయుడుపేట డీఎస్పీ జి. చెంచుబాబు మరియు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ., ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, నేరాలకు పాల్పడిన వ్యక్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా దర్యాప్తు నుంచి కోర్టు విచారణ వరకు ప్రతి దశలోనూ పోలీసులు బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా నాణ్యమైన దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాల సేకరణతో పాటు గుడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా కోర్టు విచారణను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.
నేరస్తులకు శిక్ష పడేలా నాణ్యమైన దర్యాప్తు, సమర్థవంతమైన ప్రాసిక్యూషన్, నిరంతర కోర్టు పర్యవేక్షణకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
Tags: Life imprisonment for the accused in a murder case