రాప్తాడు ముచ్చట్లు:
ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన రాప్తాడు బాలికకు నిర్వహించిన ఆర్థోపెడిక్ సర్జరీ విజయవంతమైంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. బాలికకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు వైద్యులు ఆర్థోపెడిక్ సర్జరీ పూర్తి చేశారని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. ఆపరేషన్ థియేటర్‌లోనే ప్లాస్టిక్ సర్జరీ బృందం కూడా బాలిక పరిస్థితిని సమీక్షించిందని తెలిపారు. సర్జరీ అనంతరం బాలికను పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసీయూ)కు తరలించారని, ప్రస్తుతం బాలిక క్షేమంగా ఉందని వివరించారు.
బాలికకు సాధ్యమైనంత ఉత్తమ వైద్య సంరక్షణ అందించేందుకు వైద్య బృందంతో నిరంతరం టచ్‌లో ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. రాప్తాడుకు చెందిన హేమంత్ అనే వ్యక్తి దాడిలో బాలిక తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ప్రభుత్వం బాలిక వైద్య ఖర్చులను పూర్తిగా భరిస్తూ, ఆమె ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
Tags:Surgery for Raptadu girl successful: Minister Lokesh