November 5, 2026
Explore
శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

November 5, 2026 | Andhra Pradesh

తిరుపతిముచ్చట్లు:

    తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో నవంబ‌రు 8న దీపావ‌ళి ఆస్థానం సంద‌ర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర ఆలయాల గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.

నవంబ‌రు 8వ తేదీ దీపావళి సందర్భంగా సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం వైభవంగా జ‌రుగ‌నుంది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, సూపరింటెండెంట్‌ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయులు, అర్చక బృందం పాల్గొన్నారు.


Tags: 'Koil Alwar Tirumanjanam' held on a grand scale at Sri Govindaraja Swamy Temple