అమరావతిముచ్చట్లు:
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఎనిమిది గంటలకు ప్రారంభమైనా సాంకేతికంగా అసలు లెక్కింపు మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. ట్రెండ్స్ అప్పటి నుంచే వస్తాయి. బ్యాలెట్లతో ఎన్నికలు జరగడం వల్ల ముందుగా చాలా ప్రాసెస్ ఉంటుంది.బ్యాలెట్ పేపర్ పద్ధతిలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా, అనేక దశల్లో పారదర్శకంగా జరుగుతుంది. ఈ లెక్కింపు ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం రిటర్నింగ్ ఆఫీసర్ పర్యవేక్షణలో నిర్వహిస్తారు. ఉదయాన్నే రిటర్నింగ్ ఆఫీసర్, అభ్యర్థులు లేదా వారి లెక్కింపు ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను తెరుస్తారు.
పోలింగ్ ముగిసాక వేసిన సీళ్లు చెక్కుచెదరకుండా ఉన్నాయా లేదా అని ఏజెంట్లకు చూపించి సంతకాలు తీసుకుంటారు. కౌంటింగ్ హాల్లో అమర్చిన టేబుళ్ల వద్దకు బ్యాలెట్ బాక్సులను తీసుకువస్తారు. పోలింగ్ స్టేషన్ల ఆధారంగా ఏ బ్యాలెట్ బాక్స్ ఏ టేబుల్‌కి వెళ్లాలో ముందే నిర్ణయించిన రౌండ్ల వారీగా కేటాయిస్తారు. బ్యాలెట్ బాక్సులను తెరిచి అందులోని బ్యాలెట్ పేపర్లను బయటకు తీస్తారు. మొదట ఏజెంట్ల సమక్షంలో మొత్తం ఓట్లు పోలింగ్ రోజు నమోదైన వివరాలతో సరిపోలాయో లేదో సరిచూసుకుంటారు. వేగవంతమైన లెక్కింపు కోసం సాధారణంగా 25 లేదా 50 బ్యాలెట్ పేపర్లను ఒక కట్టగా కడతారు.కౌంటింగ్ సిబ్బంది ప్రతి బ్యాలెట్ పేపర్‌ను నిశితంగా పరిశీలించి రెండు భాగాలుగా వేరు చేస్తారు. స్పష్టంగా ఏదో ఒక అభ్యర్థి గుర్తుపై స్టాంప్ పడిన ఓట్లు, సందేహాస్పద , చెల్లని ఓట్లను వేరు చేస్తారు. బ్యాలెట్ పేపర్‌పై ఏ అభ్యర్థి గుర్తుపైనా స్టాంప్ వేయకపోతే ఓట్ చెల్లదు. అలాగే ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థుల గుర్తులపై స్టాంప్ వేసినా, స్టాంప్ గుర్తు అభ్యర్థి పేరు సరిహద్దు దాటి ఇద్దరి మధ్యలో పడి స్పష్టత లేకపోయినా ఓటు చె ల్లదు. బ్యాలెట్ పేపర్ చిరిగిపోయినా, ఓటరు సంతకం, పేరు రాసి ఓటును గుర్తించేలా చేస్తే కూడా చెల్లదు. వెనుక వైపు పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం లేదా పోలింగ్ స్టేషన్ ముద్ర లేకపోయినా పరిగణనలోకి తీసుకోరు.
చెల్లుబాటైన ప్రతీ బ్యాలెట్ పేపర్‌ను సదరు అభ్యర్థికి కేటాయించిన ట్రే కంపార్ట్మెంట్లో వేస్తారు. అభ్యర్థుల వారీగా వేరు చేసిన ఓట్లను మళ్లీ 50 ఓట్ల కట్టలుగా కట్టి, ఒక్కో టేబుల్ వద్ద ఏజెంట్లకు చూపిస్తూ లెక్కిస్తారు. చెల్లనివిగా భావించిన ఓట్లను రిటర్నింగ్ ఆఫీసర్ స్వయంగా పరిశీలించి, అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో ఆ ఓటు చెల్లుతుందా లేదా అనేది చట్టబద్ధంగా తుది నిర్ణయం తీసుకుంటారు. టేబుళ్ల వారీగా వచ్చిన ఫలితాలను ఫారమ్‌లలో నమోదు చేసి రిటర్నింగ్ ఆఫీసర్‌కు పంపుతారు. ప్రతీ రౌండ్ ముగియగానే అభ్యర్థులకు వచ్చిన ఓట్లను కౌంటింగ్ హాల్లోని మైక్ ద్వారా ప్రకటిస్తారు. వార్డు, డివిజన్ పరిధిలోని అన్ని రౌండ్లు ముగిసిన తర్వాత అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.విజేతకు, ప్రత్యర్థికి మధ్య చాలా స్వల్ప తేడా ఉన్నప్పుడు ప్రత్యర్థి అభ్యర్థి లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకుంటే RO రీ-కౌంటింగ్‌కు ఆదేశించవచ్చు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే.. లాటరీ తీసి విజేతని నిర్ణయిస్తారు.
Tags: Municipals: Trends to emerge from the afternoon onwards!