October 30, 2026
Explore
మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదు

మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదు

October 30, 2026 | Andhra Pradesh

– జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

ఎన్నికల బందోబస్తుకు పటిష్ట ఏర్పాట్లు: ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సన్నద్ధత, భద్రతా ఏర్పాట్లు, అధికారులకు జారీ చేసిన మార్గదర్శకాలపై సమగ్ర సమీక్ష

మదనపల్లె ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లాలో జరుగుతున్న మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల నిబంధనలు, రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ప్రతి అధికారి తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

శుక్రవారం మదనపల్లె కలెక్టరేట్‌లోని నీతి హాలులో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, సన్నద్ధత, భద్రతా ఏర్పాట్లు, అధికారులకు జారీ చేసిన మార్గదర్శకాల అమలుపై సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులు, సంబంధిత ఎన్నికల అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను పూర్తి అప్రమత్తతతో నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలో ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేయాలన్నారు. ఎన్నికల ఏర్పాట్లలో చివరి నిమిషంలో మార్పులు, పొరపాట్లు చోటుచేసుకోకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు.

పోలింగ్ సిబ్బంది కేటాయింపు, బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామగ్రి పంపిణీ, పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు, సిబ్బందికి శిక్షణ తదితర అంశాలను ముందుగానే పూర్తి చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని విభాగాలు ప్రతిరోజూ తమ పనుల పురోగతిని సమీక్షించుకోవాలని ఆదేశించారు.

పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిని స్పష్టంగా గుర్తించాలని, పారిశుధ్య సిబ్బంది, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. రిసెప్షన్ కేంద్రాల వద్ద క్రమబద్ధమైన ఏర్పాట్లు చేపట్టి, అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

ఎన్నికల నియంత్రణ గది (కంట్రోల్ రూమ్) నిరంతరం సమర్థవంతంగా పనిచేయాలని, అందిన ప్రతి ఫిర్యాదును వెంటనే నమోదు చేసి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని తెలిపారు. అలాగే మదనపల్లి, రాయచోటి, పీలేరు డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సుల రిసెప్షన్, స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ ఏర్పాట్లు తదితరాల్లో తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు జారీ చేశారు.

జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ…. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి పోలీసు సిబ్బందిని కేటాయించి, సంబంధిత సిబ్బంది ముందుగానే కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ మేనేజ్‌మెంట్, ఓటర్ల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని తెలిపారు. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, మాజీ సైనికులు, అగ్నిమాపక శాఖ తదితర విభాగాల సిబ్బంది సేవలను కూడా వినియోగించుకోనున్నట్లు వివరించారు.

మొత్తం 45 పోలింగ్ లొకేషన్ల వద్ద సంబంధిత అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ప్రతి కేంద్రానికి కనీసం రెండు మూడు సంప్రదింపు నంబర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ శాతం వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి కంట్రోల్ రూమ్‌కు అందించాలన్నారు. సుమారు 10 క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను (QRT) ఏర్పాటు చేసి, రూట్ల వారీగా పర్యవేక్షణ చేపట్టనున్నట్లు తెలిపారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా ఎంసీసీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు పటిష్టంగా నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందినా వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని తెలిపారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, డీఆర్వో వెంకటేష్, ఆర్డీవోలు శ్రీనివాస్, విజయలక్ష్మి, మదనపల్లె, పుంగనూరు మున్సిపల్ కమిషనర్లు, జెడ్పీ సీఈఓ, ఎన్నికల వివిధ కమిటీల జిల్లా నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags;There should be no room for any errors in the conduct of the Municipal, ZPTC, and MPTC elections.