October 27, 2026
Explore
తల్లిదండ్రులకు చోటులేని స్థలాన్ని ఇక గృహం అనరాదు

తల్లిదండ్రులకు చోటులేని స్థలాన్ని ఇక గృహం అనరాదు

October 27, 2026 | Andhra Pradesh

హైదరాబాదుముచ్చట్లు:

ఇటీవల హైదరాబాదు గచ్చిబౌలి సమీపంలో 33వ అంతస్తులో, మూడు కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఓ రెండు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్ గృహప్రవేశానికి వెళ్లాను.

ఇంటి యజమాని ఎంతో గర్వంగా ఇల్లంతా తిప్పి చూపిస్తున్నారు. ఇది మాస్టర్ బెడ్‌రూమ్, అది పిల్లల గది, ఇదేమో విశాలమైన హాలు, ఆ పక్కన పూజ గది, ఇక ఈ కిచెన్ పూర్తిగా మోడరన్‌గా ఉందంటూ ప్రతి గదినీ ఎంతో ఉత్సాహంగా వివరించారు. ఇల్లు నిజంగా చాలా అందంగా ఉంది. అంత మంచి పాష్ లొకాలిటిలో అలాంటి ఓ ఫ్లాటు అంతటి సదుపాయాలతో ఎంతో చౌకగా దొరికినట్టే.

వారిని అభినందిస్తూ, ఓ ప్రశ్న అడిగాను, “మరి మీ అమ్మానాన్నలు ఎక్కడ ఉంటున్నారు? వారికోసం ఏ గది కేటాయించారు?”

వారు ఏమాత్రం తడుముకోకుండా, “వాళ్లు కేపీహెచ్‌బీలో ఓ సింగిల్ బెడ్‌రూమ్ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు” అన్నారు. ఆ మాట వినగానే నా మనసు ఒక్కసారిగా కలచివేసింది!

మూడు కోట్లు పెట్టి ఇల్లు కొనగలిగిన మనిషికి, తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రుల కోసం ఓ గదిని కేటాయించలేక పోయాడా? తన ఇంట్లో దేవుడికి పూజగది ఉంది, పిల్లలకు ప్రత్యేక గది ఉంది, ఆధునిక సౌకర్యాలన్నీ ఉన్నాయి, కానీ తన కోసం జీవితమంతా త్యాగం చేసిన తల్లిదండ్రులకు మాత్రం చోటు లేదా?

ఆ క్షణం ఆ ఇంటి అందమంతా నా కళ్లకు వెలవెలబోయింది. అక్కడ వడ్డించే విందు మీద కూడా నాకు ఆసక్తి కలగలేదు. ఎందుకంటే, తల్లిదండ్రులకు చోటు లేని ఇంట్లో సౌకర్యాలు ఉండవచ్చేమో గానీ, సంపూర్ణమైన సంతోషం ఉంటుందా?

ఇది కేవలం ఒక ఇంటి కథ కాదు, మన సమాజం ఆలోచించాల్సిన ప్రశ్న!
వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు కావలసింది విలాసవంతమైన గది కాదు. తమవారితో కలిసి ఉండే ఆప్యాయత, నాలుగు ప్రేమ మాటలు, అవసరమైనప్పుడు పలకరించే మనసు.

వారు మనకు ఇచ్చిన బాల్యాన్ని తిరిగి ఇవ్వలేకపోయినా, వారి మలివయసులో మన ప్రేమను పంచలేమా? పైగా తమ పిల్లలకు మంచి సంస్కృతి సంప్రదాయాలను నేర్పిస్తారు కూడాను,

గుర్తుంచుకోండి, దేవుడికి గది కేటాయించడం భక్తి అయితే, కన్న తల్లిదండ్రులకు చోటివ్వడం మన ధర్మం!
ఇల్లు ఎంత ఎత్తులో ఉన్నా, అందులోని మనసులు అంత ఎత్తుకు ఎదగకపోతే ఆ వైభవానికి అర్థమేముంది? అందుకే నా మనవి ఒక్కటే.

తల్లిదండ్రులు ఉన్నవారు ప్రతి ఇంట్లో దేవుడి గది ఉన్నా లేకున్నా వారి గురించి ఓ గది ఉండాలి! అంటే 3 bed room flat compulsory అన్నట్టు.
ఎందుకంటే, మన ఇంటికి నిజమైన అందం ఖరీదైన ఫర్నిచర్ కాదు, మన పెద్దల చిరునవ్వు!

ఈ మధ్య ఓ ప్రవచనకారుడి మాటల్లో మనం ఎవరెవరి ఇళ్లలో భోజనం చేయకూడదో అన్న ప్రవచనం గుర్తు కొచ్చింది. ఆ విషయం గుర్తొచ్చి వృద్ధులైన తల్లిదండ్రులను దూరంగా ఉంచే ఇలాంటి ఆధునిక పిల్లల ఇంటిలో కూడా మనం చేయి కడుగకూడదు, అంటే అన్నపానీయాలు స్వీకరించరాదు, అలాంటివారి శుభకార్యాలకు ఇకమీదట వెళ్ళకూడదన్న నిర్ణయం తీసుకొన్నాను.

మరి మీరేమంటారు.
దేవుడు సృష్టించిన ఈ సంక్లిష్ట ప్రపంచాన్ని మనం అర్థం చేసుకునే లోపు , మన జీవితం ముగిసే ఘడియ రావచ్చు..

మాతృ దేవో భవ, పితృ దేవో భవ,ఆచార్య దేవో భవ,అతిథి దేవో భవ” అనేవి భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాచీనమైన, ఉపనిషత్తుల నుండి వచ్చిన గొప్ప భావనలు.

Tags:A place that has no room for parents can no longer be called a home.