మదనపల్లి ముచ్చట్లు:
1,616 మంది అభ్యర్థులు.. జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ
అన్నమయ్య జిల్లాలో అక్టోబర్ 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న ఏపీ స్పెషల్ టెట్–2026 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో పరీక్షల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు.
జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 1,616 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు కల్పించాలని, పోలీసు బందోబస్తు, ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. అభ్యర్థుల హాల్టికెట్లు, గుర్తింపు కార్డులను పరిశీలించి నిబంధనల ప్రకారం పరీక్షలకు అనుమతించాలన్నారు. దివ్యాంగులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.
అక్టోబర్ 11 నుంచి 15 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం, కలెక్టరేట్ ఏవో శ్రావణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Tags: Foolproof arrangements must be made for the special TET exams.