October 24, 2026
Explore
ఓడిపోయే మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించిన తెలుగోళ్లు!

ఓడిపోయే మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించిన తెలుగోళ్లు!

October 24, 2026 | Andhra Pradesh

న్యూజిలాండ్ ముచ్చట్లు:

న్యూజిలాండ్ పర్యటనలో భారత్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్ వేదికగా శనివారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

తెలుగు తేజాలు తిలక్ వర్మ(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 51 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి(13 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 26 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో అదిరిపోయే విజయాన్ని అందించారు. ఓటమి ఖాయమనుకున్న ఈ మ్యాచ్‌లో 69 పరుగుల అజేయ భాగస్వామ్యంతో గట్టెక్కించారు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

పాపం ఫిలిప్స్..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. గ్లేన్ ఫిలిప్స్(43 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 70), బెవాన్ జాకోబ్స్(46 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 58) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(2/33) రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్(1/50), ప్రిన్స్ యాదవ్(1/30), నితీష్ కుమార్ రెడ్డి(1/31)తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం భారత్ 19.5 ఓవర్లలో 6 వికెట్లకు 181 పరుగులు చేసి గెలుపొందింది. తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డితో పాటు నమన్ ధీర్(17 బంతుల్లో ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్(4/21) నాలుగు వికెట్లు తీయగా.. జాకోబ్ డఫీ, నాథన్ స్మిత్ తలో వికెట్ తీసారు.

టాపార్డర్ విఫలమైనా..

181 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించిన అనంతరం సంజూ శాంసన్(14) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇషాన్ స్థానంలో బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ(4) తీవ్రంగా నిరాశపర్చాడు. దాంతో భారత పరుగుల వేగం తగ్గింది. దూకుడుగా ఆడే క్రమంలో అభిషేక్ శర్మ(27) ఔటవ్వగా.. శ్రేయస్ అయ్యర్(7) సాంట్నర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. డారిల్ మిచెల్ అద్భుతమైన రిలే క్యాచ్‌కు అక్షర్ పటేల్(11) వెనుదిరగడంతో భారత్ 70 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

మలుపు తిప్పిన డఫీ ఓవర్..

ఈ పరిస్థితుల్లో నమన్ ధీర్, తిలక్ వర్మ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నమన్ ధీర్ భారీ సిక్సర్లతో బ్యాటర్లపై ఒత్తిడి తగ్గించాడు. కానీ అతన్ని సాంట్నర్ ఔట్ చేయడంతో భారత్ ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ నితీష్ రెడ్డి సాయంతో తిలక్ వర్మ జట్టును విజయం దిశగా నడిపాడు. జాకోబ్ డఫీ వేసిన 17వ ఓవర్‌లో నితీష్ రెడ్డి సిక్స్ బాదదగా.. తిలక్ వర్మ రెండు బౌండరీలు కొట్టి 17 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్‌తో భారత్‌కు మూమెంటమ్ లభించింది.

నాథన్ స్మిత్ వేసిన 19వ ఓవర్‌లో తిలక్ వర్మ 4,4, 0, 4,0, 6 బాది 18 పరుగులు పిండుకున్నాడు. దాంతో ఆఖరి ఓవర్‌లో భారత్ విజయానికి 11 పరుగులే అవసరమయ్యాయి. డఫీ వేసిన ఈ ఓవర్‌లో నితీష్ సింగిల్ తీయగా.. తిలక్ వర్మ ఒక ఫోర్, క్విక్ డబుల్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరుసటి బంతిని సింగిల్ తీయగా.. డఫీ వైడ్ వేసాడు. నితీష్ రెడ్డి క్విక్ డబుల్‌తో మరో బంతి ఉండగానే విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Tags;Telugus who led Team India to victory in a match that seemed lost!