బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అంటే ఇదే..!
రాజస్థాన్ ముచ్చట్లు:
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళా ఖైదీలను నిబంధనలకు విరుద్ధంగా జైలు నుంచి బయటకు తీసుకెళ్లి తన ఇంట్లో పనులు చేయించారన్న ఆరోపణలపై మాజీ మహిళా జైలర్ దివ్య చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు నెలలుగా పరారీలో ఉన్న ఆమెను సాంకేతిక ఆధారాలతో కోటాలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. 2026 జూలై 12న అజ్మీర్ మహిళా జైలుకు ఇన్‌చార్జిగా ఉన్న దివ్య చౌదరి, మహిళా గార్డు సోనియా చౌదరితో కలిసి జీవిత ఖైదు అనుభవిస్తున్న కిరణ్, సానా అనే ఇద్దరు ఖైదీలను జైలు రికార్డుల్లో నమోదు చేయకుండా ప్రైవేట్ వాహనంలో బయటకు తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారిని అజ్మీర్‌లోని ఏఆర్‌జీ సిటీలో ఉన్న తన ప్రైవేట్ ఫ్లాట్‌కు తీసుకెళ్లి ఇంటి పనులు చేయించినట్లు అధికారులు తెలిపారు.
ఖైదీలను బయటకు తీసుకెళ్లడాన్ని జైలు ప్రధాన ద్వారం వద్ద విధుల్లో ఉన్న మహిళా సిబ్బంది వ్యతిరేకించగా, వారిని బెదిరించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. విషయం బయటపడటంతో ఖైదీలను తిరిగి జైలుకు తరలించారు.
శాఖాపరమైన విచారణ అనంతరం దివ్య చౌదరి, సోనియా చౌదరిని అధికారులు సస్పెండ్ చేశారు. అయితే ఇద్దరూ తమకు కేటాయించిన హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయకుండా పరారయ్యారు. ఈ వ్యవహారంపై ఆగస్టు 5న అజ్మీర్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
అజ్మీర్ ఎస్పీ హర్షవర్ధన్ అగర్వాల్ ఆదేశాలతో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. సైబర్ సెల్ సాంకేతిక ఆధారాలు, మొబైల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో దివ్య ఆచూకీని గుర్తించి కోటాలో అరెస్టు చేసింది. కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆమెను జ్యుడిషియల్ కస్టడీకి పంపింది.
ఒకప్పుడు జైలర్‌గా విధులు నిర్వహించిన దివ్య చౌదరి.. ఇప్పుడు అదే అజ్మీర్ సెంట్రల్ జైలులో ఖైదీగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. మరో నిందితురాలైన మహిళా గార్డు సోనియా చౌదరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Tags: She once worked as a jailer… now she is a prisoner in the same jail!