. లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలి.
క్రమశిక్షణ, నైతిక విలువలను పాటిస్తే సాధించలేనిది ఏదీ లేదు.
- శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో షక్తి బృందం అవగాహన కార్యక్రమం.
- ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన.
- ప్రేమ వ్యవహారాలు, ఒత్తిడి, ఆత్మహత్యల నివారణపై ప్రత్యేక సూచనలు.
- తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ క్రమశిక్షణతో జీవించాలని సూచన.
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు, యువత భద్రత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించడంలో భాగంగా షక్తి బృందం ఆధ్వర్యంలో కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం. శ్రీలత మరియు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ ఎం. తమీమ్ అహ్మద్ పాల్గొని విద్యార్థులకు ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సైబర్ నేరాలు, ప్రేమ వ్యవహారాలు, క్రమశిక్షణ, నైతిక విలువలు, విద్య ప్రాధాన్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సమాజంలో చోటుచేసుకుంటున్న ఘటనలు, సంబంధిత కేసుల ఉదాహరణలను వివరిస్తూ విద్యార్థులను అప్రమత్తం చేశారు.
వ్యక్తిగత లేదా విద్యా సంబంధిత సమస్యలు ఎదురైనప్పుడు నిరాశకు లోనై తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసుల సహాయం తీసుకుని సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ క్రమశిక్షణతో వ్యవహరించాలని, విద్యను ప్రాధాన్యతగా తీసుకుని భవిష్యత్తు లక్ష్యాల సాధనకు కృషి చేయాలని తెలిపారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింకులు, అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు లేదా ఆన్‌లైన్ మోసాలకు స్పందించవద్దని సూచించారు. మహిళలు, బాలికల భద్రతకు సంబంధించిన సమస్యలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 112 ను, సైబర్ ఆర్థిక మోసాలకు గురైనప్పుడు 1930 కు సమాచారం అందించాలని సూచించారు.
విద్యార్థుల భద్రత, వారి భవిష్యత్తు మరియు బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా ఇటువంటి అవగాహన కార్యక్రమాలను జిల్లా పోలీస్ శాఖ నిరంతరం నిర్వహిస్తుందని అధికారులు తెలిపారు.
Tags: Students should face problems courageously.