బెంగళూరుముచ్చట్లు:
ఒక యువతి తన ప్రియుడ్ని పెళ్లి చేసుకుని అతడితో కలిసి నివసిస్తున్నది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమ కుమార్తె కిడ్నాప్ కోసం ప్లాన్ వేశారు. వారు పంపిన వ్యక్తులు ఆ యువతిని కిడ్నాప్ చేశారు. అయితే కారులో పారిపోతుండగా స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ కారు పలు బైకులను ఢీకొట్టడంతో ఆరు మందికిపైగా గాయపడ్డారు.
రాజస్థాన్‌లోని మెల్వాస్ గ్రామానికి చెందిన 21 ఏళ్ల పూజా తన ప్రియుడైన 23 ఏళ్ల యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నది. ఆ తర్వాత ఆ జంట బెంగళూరు చేరుకున్నది. అగ్రహార దశరహళ్లి ప్రాంతంలోని అద్దె ఇంట్లో వారు నివసిస్తున్నారు.
కాగా, కుమార్తె పూజా ప్రేమ వివాహాన్ని ఆమె కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. ఆ యువతి బెంగళూరులో నివసిస్తున్నట్లు బంధువుల ద్వారా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను కిడ్నాప్ చేసి రాజస్థాన్‌కు తెచ్చేందుకు నలుగురు వ్యక్తులను అక్కడకు పంపారు. కారులో బెంగళూరు చేరుకున్న ఆ వ్యక్తులు బుధవారం రాత్రి పూజాను ఆమె ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు.
అయితే పూజాను బలవంతంగా కారులోకి ఎక్కించి పారిపోతుండగా ఆమె కేకలు వేసింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు స్పందించారు. పలు వాహనాలతో వెంబడించి ఆ కారును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆందోళన చెందిన డ్రైవర్ కారును అటూ ఇటూ నడిపాడు. స్థానికుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో పలు బైక్‌లను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆరు మందికిపై గాయపడ్డారు.
మరోవైపు ఆగ్రహించిన స్థానికులు చివరకు ఆ కారును చుట్టుముట్టారు. కిడ్నాప్ చేసిన పూజాను వారు రక్షించారు. ఆ తర్వాత రాళ్లతో కారుపై దాడి చేశారు. అందులో ఉన్న వ్యక్తులను బలవంతంగా బయటకు లాగారు. వారిని చితక్కొట్టారు. అక్కడకు చేరుకున్న పోలీసులకు ఆ వ్యక్తులను అప్పగించారు. దీంతో రాజస్థాన్‌కు చెందిన 31 ఏళ్ల రాకేష్, 25 ఏళ్ల కరణ్, 18 ఏళ్ల అయాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న కారు నడిపిన సద్దాం కోసం పోలీసులు వెతుకున్నారు.
కాగా, స్థానికుల నుంచి తప్పించుకునే క్రమంలో పలు బైకులను ఆ కారు ఢీకొట్టడంతో ఇద్దరు పిల్లలతో సహా ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని 12 ఏళ్ల పృథ్వీరాజ్, 9 ఏళ్ల యశిక, 35 ఏళ్ల అముల్, 64 ఏళ్ల మణి, 57 ఏళ్ల జయలక్ష్మి, 33 ఏళ్ల సంతోష్‌గా పోలీసులు గుర్తించారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే తలకు తీవ్ర గాయమైన జయలక్ష్మి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, స్థానికులు ఆ కారును వెంబడించి దాడి చేసిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Tags: Family kidnaps daughter who married her lover… Here is what happened next.