September 7, 2026
Explore
పేదల పండుగలో మరో కొత్త అధ్యాయం

పేదల పండుగలో మరో కొత్త అధ్యాయం

September 7, 2026 | Andhra Pradesh

• ఎన్టీఆర్ భరోసాతో మరింత మందికి సామాజిక భద్రత

• ఇప్పటికే 62 లక్షల మందికి భరోసా… ఇప్పుడు కొత్త అర్హులకూ అవకాశం

• సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ

• స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

అమరావతి ముచ్చట్లు:

రాష్ట్రంలో ప్రతి నెలా జరిగే ‘పేదల పండుగ’ను ప్రభుత్వం మరో స్థాయికి తీసుకువెళ్తోంది. ఇప్పటికే దేశంలోనే అత్యధిక స్థాయిలో సామాజిక భద్రత పింఛన్లు అందిస్తూ 62 లక్షల మంది పేదలకు ప్రతి నెలా ఆర్థిక భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం, ఇప్పుడు ఆ భరోసాను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. అర్హత కలిగిన మరింత మంది పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర బలహీన వర్గాలకు కొత్తగా అవకాశం కల్పిస్తూ ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద తాజా దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టింది.
సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తుల పరిశీలన నుంచి అర్హత నిర్ధారణ, ప్రభుత్వ ఆమోదం వరకు ప్రతి ప్రక్రియను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేసి, అర్హులైన వారికి దశలవారీగా పింఛన్లు మంజూరు చేయనున్నారు.

కొత్త అర్హులకు మరో అవకాశం

అర్హత ఉన్నప్పటికీ వివిధ కారణాలతో ఇప్పటివరకు పింఛన్ పొందని వారికి మరో అవకాశం కల్పిస్తోంది. సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హులైన వారు తమకు సంబంధించిన స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కేంద్రాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిన తరువాత నిర్దిష్ట కాలపట్టిక ప్రకారం అర్హతను పరిశీలిస్తారు. జాప్యానికి తావులేకుండా స్పష్టమైన కాలపట్టిక
కొత్త పింఛన్ దరఖాస్తుల ప్రక్రియలో పారదర్శకతతో పాటు వేగానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ప్రతి దశకు స్పష్టమైన గడువు నిర్ణయించింది.
• సెప్టెంబర్ 7–16: దరఖాస్తుల స్వీకరణ, ఆన్‌లైన్ నమోదు, ఈ-కేవైసీ ధృవీకరణ.
• సెప్టెంబర్ 17–21: సాధారణ అర్హత పరిశీలన.
• సెప్టెంబర్ 22–24: భౌతిక, శాఖాపరమైన ధృవీకరణ, అర్హత నిర్ణయం, సిఫారసు.
• సెప్టెంబర్ 25–26: సెర్ప్ ద్వారా బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోద ప్రక్రియ.
• అన్ని స్థాయిల్లో పరిశీలన పూర్తయిన అనంతరం అర్హులైన లబ్ధిదారులకు దశలవారీగా పింఛన్లు మంజూరు చేస్తారు.

రాష్ట్రంలోని అన్ని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో కొత్త పింఛన్ దరఖాస్తు సేవ అందుబాటులో ఉంటుంది. నిర్ణీత నమూనాలోని దరఖాస్తు ఫారాలను ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతారు. అర్హులు దరఖాస్తును పూర్తి చేసి, అవసరమైన ధృవపత్రాలతో సంబంధిత స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు కేంద్రంలో సమర్పించాలి. దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసిన అనంతరం సిస్టమ్ జనరేటెడ్ అక్నాలెడ్జ్‌మెంట్ అందజేస్తారు.

అవసరమైన ధృవపత్రాలు

అన్ని కేటగిరీలకు సాధారణంగా ఆధార్ కార్డు, రైస్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రంతో పాటు సంబంధిత కేటగిరీకి అవసరమైన ప్రత్యేక ధృవపత్రాలను సమర్పించాలి.
• వృద్ధాప్య పింఛన్: వయస్సు నిర్ధారణకు ఆధార్.
• వితంతు పింఛన్: భర్త మరణ ధృవపత్రం, భర్త ఆధార్ నంబర్.
• ఒంటరి మహిళ: వివాహిత అయితే కోర్టు/అదాలత్ విడాకుల డిక్రీ; అవివాహిత అయితే తహసీల్దార్ జారీ చేసే వివాహం కాని ధృవపత్రం.
• దివ్యాంగుల పింఛన్: 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ బెంచ్‌మార్క్ దివ్యాంగత్వాన్ని నిర్ధారించే SADAREM ధృవపత్రం.
• చేనేత కార్మికులు: చేనేత మరియు జౌళి శాఖ ధృవపత్రం.
• మత్స్యకారులు: మత్స్య శాఖ ధృవపత్రం.
• డప్పు కళాకారులు: సాంఘిక సంక్షేమ శాఖ ధృవపత్రం.
• సంప్రదాయ చెప్పుల తయారీదారులు: సాంఘిక సంక్షేమ శాఖ ధృవపత్రం.
• కల్లుగీత కార్మికులు: నిషేధ మరియు ఎక్సైజ్ శాఖ ధృవపత్రం.
• ట్రాన్స్‌జెండర్ లబ్ధిదారులు: జిల్లా వైద్య మండలి ధృవపత్రం.

పింఛన్ అంటే పేదలకు పండుగ…

పేదల సేవలో పింఛన్ల పండుగను మరింత విస్తరిస్తున్న ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ఒక పండుగ వాతావరణాన్ని తీసుకువస్తోంది. వృద్ధులకు ఆత్మగౌరవం, వితంతువులకు ఆర్థిక భరోసా, దివ్యాంగులకు అండ, నిరుపేద కుటుంబాలకు జీవనాధారంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం నిలుస్తోంది. పింఛన్ అందుకుంటున్న వారి సంఖ్యను మాత్రమే పెంచడం కాకుండా, అర్హత ఉన్న ప్రతి పేదవాడికి సామాజిక భద్రత అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు పింఛన్ పరిధిలోకి రాని అర్హులను గుర్తించి వారికి కూడా ఈ భరోసాను అందించేందుకు తాజా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించడం ఆ దిశలో మరో కీలక ముందడుగు.

దేశంలోనే అత్యున్నత సామాజిక భద్రత

ప్రస్తుతం రాష్ట్రంలో 61,92,396 మంది పింఛనుదారులకు నెలకు రూ.2,694 కోట్ల మేర పింఛన్లు అందిస్తున్నారు. రాష్ట్ర జనాభాలో సుమారు 12.88 శాతం మంది సామాజిక భద్రత పింఛన్ల ప్రయోజనం పొందుతున్నారు. పింఛన్ మొత్తం, పింఛనుదారుల సంఖ్య, నెలవారీ వ్యయం, పింఛన్ల కోసం కేటాయిస్తున్న వార్షిక నిధుల పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యున్నత స్థానంలో ఉంది. ఇది కేవలం గణాంకాల్లో కనిపించే రికార్డు మాత్రమే కాదు… కోట్లాది పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న నిరంతర ఆర్థిక భరోసాకు నిదర్శనం.

రూ.73,508 కోట్లతో చిత్తశుద్ధికి నిదర్శనం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ఎన్నికల హామీ మేరకు పింఛన్ మొత్తాల పెంపును అమలు చేసింది. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పలు వర్గాలకు రూ.10,000, పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.15,000 వరకు పింఛన్లు అందుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సెప్టెంబర్ 1, 2026 వరకు రూ.73,508 కోట్లను కేవలం పింఛన్ల కోసమే వ్యయం చేసింది. పేదల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో ఈ ఒక్క గణాంకమే తెలియజేస్తోంది.

అన్నివర్గాలకు అండ

ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కేవలం వృద్ధాప్య పింఛన్‌కు మాత్రమే పరిమితం కాలేదు. సమాజంలోని వివిధ వర్గాల ప్రత్యేక అవసరాలను గుర్తించి ప్రభుత్వం దాదాపు 28 రకాల కేటగిరీలలో పింఛన్లు అందిస్తోంది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు చేనేత కార్మికులు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, సంప్రదాయ చెప్పుల తయారీదారులు, ట్రాన్స్‌జెండర్లు, వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి కూడా పింఛన్ల ద్వారా సామాజిక భద్రత కల్పిస్తోంది. ప్రతి నెలా ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా జరిగే పింఛన్ల పంపిణీని ప్రభుత్వం ఇప్పటికే పేదల పండుగగా మార్చింది. ఇప్పుడు కొత్త అర్హులను కూడా ఈ సామాజిక భద్రత పరిధిలోకి తీసుకురావడం ద్వారా ఆ పండుగను మరింత విస్తరించి మరోసారి సంక్షేమ ప్రభుత్వంగా నిరూపించుకుంది.

Tags: Another new chapter in the festival of the poor.