September 4, 2026
Explore
విశాఖలో మహిళల చోరీ ముఠా గుట్టురట్టు..!

విశాఖలో మహిళల చోరీ ముఠా గుట్టురట్టు..!

September 4, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

సీసీ కెమెరాల ఆధారంగా ఇద్దరు మహిళల అరెస్ట్.. బంగారు ఆభరణాలు రికవరీ..!

విశాఖపట్నంలో బంగారు ఆభరణాల చోరీ కేసును ఎంవీపీ క్రైమ్ పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని.. వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలను పోలీసులు రికవరీ చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారు పూర్ణా మార్కెట్‌కు షాపింగ్ కోసం వెళ్లి ఆటోలో ప్రయాణించారు. జగదాంబ జంక్షన్ వద్ద ఇద్దరు మహిళలు అదే ఆటోలో ఎక్కారు. అనంతరం సెవెన్ హిల్స్ ఆసుపత్రి జంక్షన్ వద్ద వారు ఆటో నుంచి దిగిపోయారు.

ఆ తర్వాత ఫిర్యాదుదారు పెదవాల్తేరు విశాఖ ఐ హాస్పిటల్ వద్ద ఆటో దిగుతున్న సమయంలో.. తన బ్యాగ్‌లో పెట్టుకున్న బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

దీంతో ఎంవీపీ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంకోజిపాలెం ప్రాంతంలోని సీసీ కెమెరాలతో పాటు కమాండ్ కంట్రోల్‌లోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో ఎంవీపీ కాలనీలోని బృందావన్ పార్క్ వద్ద రావుల వసంత, ఆవుల పార్వతి అనే ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించారు.

వారి నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలను రికవరీ చేసి.. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల ప్రకారం.. రావుల వసంతపై ఇప్పటికే విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, నెల్లూరు జిల్లాల్లో పలు చోరీ కేసులు నమోదై ఉన్నాయి.

అలాగే ఆవుల పార్వతిపై కూడా శ్రీకాకుళం, విజయనగరం తదితర ప్రాంతాల్లో పలు చోరీ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కేసును త్వరితగతిన ఛేదించిన ఎంవీపీ క్రైమ్ సీఐ వి.చక్రధరరావు, ఎస్‌ఐ ఎస్.రాజు, కానిస్టేబుళ్లు ఎస్.హరిప్రసాద్, ఎన్.అప్పలరాజులను ఉన్నతాధికారులు అభినందించారు.

సీసీ కెమెరాల నిఘాతో నిందితులను గుర్తించి.. చోరీ సొత్తును రికవరీ చేయడంలో పోలీసులు కీలకంగా వ్యవహరించారు.

Tags: Women’s theft gang busted in Visakhapatnam!