: కలెక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి ముచ్చట్లు:
అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావుతో కలిసి తిరుమల వర్కింగ్ జర్నలిస్ట్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ, శ్రీవారి ఎలక్ట్రానిక్ మీడియా, తిరుపతి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించి పెండింగ్ దరఖాస్తులు, లబ్ధిదారుల అర్హతలు, అనువైన స్థలాల లభ్యత, కేటాయింపు విధానం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. అర్హులైన జర్నలిస్టులకు త్వరితగతిన ఇళ్ల స్థలాలు కేటాయించాలని జర్నలిస్టుల ప్రతినిధులు కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తులు, రికార్డులను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులైన జర్నలిస్టుల దరఖాస్తులను ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, తిరుపతి అర్బన్, రూరల్ తహశీల్దార్లు జనార్ధన్, సురేష్ బాబు, డీఐపీఆర్ఓ పి. గురుస్వామిశెట్టి, కలెక్టరేట్ అధికారులు, జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags: The process of allocating house sites to journalists must be expedited.