, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు
మదనపల్లె ముచ్చట్లు:
తప్పులు లేని స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా ఓటర్ల జాబితాను పటిష్టంగా రూపొందించాలని జిల్లా SIR స్పెషల్ అబ్జర్వర్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.
అన్నమయ్య జిల్లాలో జరుగుతున్న SIR ప్రక్రియ పరిశీలన నిమిత్తం గురువారం మదనపల్లెకు విచ్చేసిన SIR స్పెషల్ అబ్జర్వర్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు పట్టణంలోని GRT హైస్కూల్, పప్పిరెడ్డిపల్లి పురపాలక ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న 16/164, 89/164, 93/164 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లోని డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలను పరిశీలించిన ఆయన, SIR ప్రక్రియలో గుర్తించిన మరణించిన ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లు తదితర వివరాలకు సంబంధించిన ఫారాలను పరిశీలించారు. ఆయా పోలింగ్ కేంద్రాల పరిధికి చెందిన ఓటర్ల వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అన్న విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా ఒకే ఇంటి నంబర్‌కు అధిక సంఖ్యలో ఓటర్లు నమోదై ఉన్నారా, ఫొటోలు లేని ఓటర్ల వివరాలు ఉన్నాయా వంటి అంశాలను పరిశీలించి, అటువంటి వివరాలను మరోసారి క్షుణ్ణంగా ధృవీకరించాలని సూచించారు. ఓటర్ల జాబితా పరిశీలనతో పాటు పోలింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లు, ఓటర్ల వివరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణ నాటికి ఎలాంటి తప్పులు, పొరపాట్లు లేకుండా జాబితాలను పూర్తి స్థాయిలో పరిశీలించాలని అధికారులకు స్పష్టం చేశారు.
పట్టణ ఆరోగ్య కేంద్రం తనిఖీ
అనంతరం మదనపల్లె త్యాగరాజు వీధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC)ను SIR స్పెషల్ అబ్జర్వర్ మరియు సెకండరీ హెల్త్ డైరెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు పరిశీలించారు.
ఆరోగ్య కేంద్రంలో రోజువారీ ఓపీ, ఐపీ సేవలు, ల్యాబొరేటరీ పరీక్షలు, రోగుల అడ్మిషన్లు తదితర అంశాలపై వైద్య సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సిబ్బందిని ఏ విధంగా వినియోగిస్తున్నారనే అంశంపై కూడా ఆరా తీశారు.
ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
ఈ తనిఖీల్లో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డిఎంహెచ్వో డా. శ్రీనివాసులు, డిసిహెచ్ఎస్ లక్ష్మీప్రసాద్, రెవెన్యూ అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: SIR Special Observer inspects polling stations and health center.