ఏపీ హైకోర్టు తీర్పు
చిలకలూరిపేట ముచ్చట్లు:
చిలకలూరిపేట మున్సిపాలిటీలో పసుమర్రు, గణపవరం, మానుకొండవారిపాలెం గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ 2020లో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన జీవో ఎంఎస్ నం. 83, జీవో ఎంఎస్ నం. 260లను రద్దు చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్.ఎన్ ఉత్తర్వులు జారీ చేశారు.గ్రామసభల నిర్వహణకు సంబంధించి కనీసం 48 గంటల ముందు డండోరా/నోటీసు ఇవ్వాలనే నిబంధనను పాటించలేదని, సమర్పించిన తీర్మాన పత్రాల్లో తేడాలు, దిద్దుబాట్లు ఉన్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. సరైన చట్టబద్ధ ప్రక్రియను అనుసరించకుండా చేసిన విలీనం చెల్లదని పేర్కొంటూ దాఖలైన రిట్ పిటిషన్ (WP No. 19692/2020) ను హైకోర్టు ఆమోదించింది. అదే సమయంలో, ఈ గ్రామాలను మున్సిపాలిటీ నుంచి తిరిగి వేరుచేసి (డీ-మెర్జర్) పంచాయతీలుగా కొనసాగించేందుకు అధికారులు అనుసరించిన ప్రక్రియను సమర్థిస్తూ, అందుకు వ్యతిరేకంగా దాఖలైన మరో పిటిషన్ (WP No. 7523/2026) ను న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో ఆయా గ్రామాలు తిరిగి గ్రామ పంచాయతీలుగా కొనసాగేందుకు మార్గం సుగమమైంది.
Tags:Merger of three villages with Chilakaluripet Municipality cancelled.