. భారీగా తగ్గనున్న ధర!
ఎంక్యూర్ ఫార్మాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నిపుణుల కమిటీ
మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నుంచి కంపెనీలకు మినహాయింపు
50 నుంచి 70 శాతం వరకు ధర తగ్గే అవకాశం
గిలీడ్ సైన్సెస్ నుంచి రాయల్టీ రహిత లైసెన్స్ ఒప్పందం
హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్.. హెచ్ఐవీ వ్యాప్తిని నివారించే “లెనాకాపవిర్” జెనరిక్ ఇంజెక్షన్‌ను భారత్‌లో తయారు చేసి, విక్రయించేందుకు అనుమతి పొందింది. ఈ విషయంలో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండానే ఉత్పత్తికి, మార్కెటింగ్‌కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఇంజెక్షన్ ధర భారీగా తగ్గే అవకాశం ఏర్పడింది.
డాక్టర్ రెడ్డీస్‌తో పాటు ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్‌కు కూడా నిపుణుల కమిటీ ఈ అనుమతిని మంజూరు చేసింది. అయితే, మార్కెట్లోకి విడుదల చేశాక నాలుగో దశ (ఫేజ్-4) క్లినికల్ పరీక్షలు నిర్వహించి, ఆ డేటాను సమర్పించాలని కంపెనీలను ఆదేశించింది. ఈ ఇంజెక్షన్‌ను హెచ్ఐవీ ముప్పు అధికంగా ఉన్నవారు (కనీసం 35 కిలోల బరువు ఉండాలి) ఏడాదికి రెండుసార్లు తీసుకోవాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ ఫార్మా సంస్థ గిలీడ్ సైన్సెస్‌కు “లెనాకాపవిర్” ఔషధంపై పేటెంట్ ఉంది. అయితే, ఎలాంటి రాయల్టీ తీసుకోకుండా భారత్‌తో పాటు 120 అల్పాదాయ దేశాల్లో ఈ మందును తయారు చేసేందుకు గిలీడ్ పలు కంపెనీలకు లైసెన్సులు మంజూరు చేసింది. అమెరికా, ఈయూ దేశాల్లో దీని వార్షిక ఖర్చు రూ.27 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు ఉండగా, జెనరిక్ రాకతో భారత్‌లో ప్రస్తుతం ఉన్న ధర కంటే 50 నుంచి 70 శాతం వరకు తగ్గుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆరిజెన్‌కు భారీ కాంట్రాక్టు
డాక్టర్ రెడ్డీస్ అనుబంధ సంస్థ అయిన ఆరిజెన్ ఫార్మా ఒక అంతర్జాతీయ కంపెనీ నుంచి భారీ కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ ఒప్పందం కింద దీర్ఘకాలం పాటు స్టెరైల్ ఇంజెక్టబుల్స్, బయోలాజిక్స్ తయారు చేసి సరఫరా చేయనుంది. కాంట్రాక్టులోని షరతుల కారణంగా భాగస్వామ్య కంపెనీ పేరును వెల్లడించలేదు.
Tags: Dr. Reddy’s gets the green signal to manufacture an HIV prevention injection.