August 25, 2026
Explore
తిరుమలలో ఇకపై ప్రతి మంగళవారం ”క్లీనింగ్ డే”

తిరుమలలో ఇకపై ప్రతి మంగళవారం ”క్లీనింగ్ డే”

August 25, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిల ఆదేశాల మేరకు తిరుమలలోని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఇకపై ప్రతి మంగళవారం “క్లీనింగ్ డే” ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్ణయించింది.

ఇటీవల ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొంటోందని భక్తుల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో డిప్యూటీ ఈవో సోమన్నారాయణ ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ అధికారులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

వారం రోజుల పాటు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే దుకాణాల పరిసరాల్లో పేరుకుపోయే వ్యర్థాలు, మురికి తదితరాలను తొలగించి పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి మంగళవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను మూసివేసి సంపూర్ణంగా శుభ్రం చేసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.

ఇందులో భాగంగా మంగళవారం తిరుమలలోని మూడో సత్రం, పీఏసీ–1, పీఏసీ–2 తదితర ప్రాంతాల్లోని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లను మూసివేసి పరిసరాలను శుభ్రం చేశారు.

దుకాణాల్లో బొద్దింకలు, ఎలుకలు, బల్లులు తదితరాలు లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రత పాటించాలని ఆరోగ్యశాఖ అధికారులు నిర్వాహకులకు సూచించారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విక్రయ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని ఆదేశించారు.

ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో పరిశుభ్రతకు సంబంధించి భక్తుల నుంచి ఫిర్యాదులు అందితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు పాటించకుండా దుకాణాలను నిర్వహించే వారిపై టీటీడీ ఆరోగ్యశాఖ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో తిరుమలలో పారిశుధ్యం, ఆహార నాణ్యత విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

Tags: “Cleaning Day” in Tirumala every Tuesday from now on.