August 25, 2026
Explore
దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉత్తమోత్తమ కలశ స్నపనం

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉత్తమోత్తమ కలశ స్నపనం

August 25, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

473 పవిత్ర కలశ జలాలతో స్వామివారికి అభిషేకం

దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జరుగుతున్న జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు భక్తిభావంతో, ఆగమశాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉత్తమోత్తమ కలశ స్నపనం పవిత్ర వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా 473 పవిత్ర కలశాల్లో ఆవాహన చేసిన తీర్థజలాలతో స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఆలయ పవిత్రత, దైవశక్తి మరింత వృద్ధి చెందాలని, సర్వలోకాలకు శ్రీనివాసుని అనుగ్రహం కలగాలని అర్చకులు భక్తిశ్రద్ధలతో ఈ విశిష్ట క్రతువును నిర్వహించారు.

అంతకుముందు చతుస్థానార్చన, మూర్తి హోమం, అష్టబంధనం తదితర కార్యక్రమాలను ఆగమశాస్త్ర విధానాలను అనుసరించి నిర్వహించారు. సాయంత్రం శయ్యాధివాసం, తత్వ హోమాలు, శాంతి హోమం, శాత్తుమొర కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

ఆగస్టు 26న మహాసంప్రోక్షణ

ఆగస్టు 26న ఉదయం 7 గంటలకు చతుస్థానార్చన, మూర్తి హోమం, ప్రాయశ్చిత్త హోమం నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 9.45 నుంచి 11.30 గంటల వరకు శ్రవణా నక్షత్రం, తులా లగ్నంలో మహా పూర్ణాహుతి, మహాసంప్రోక్షణ, కళాకర్షణ కార్యక్రమాలను ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.

మహాసంప్రోక్షణ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు.

ఈ కార్యక్రమాల్లో ఆలయ డెప్యూటీ ఈవో ఎ. ప్రశాంతి, ఏఈవో రవి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్ రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Tags: The supreme Kalasha Snapanam (ritual bath using consecrated pots) was performed in strict accordance with scriptural norms at the Sri Lakshmi Venkateswara Swamy Temple in Devuni Kadapa.