August 21, 2026
Explore
రోడ్డు ప్రమాద బాధితులకు ‘పి.ఎం.రాహత్’ ద్వారా ఉచిత వైద్యం

రోడ్డు ప్రమాద బాధితులకు ‘పి.ఎం.రాహత్’ ద్వారా ఉచిత వైద్యం

August 21, 2026 | Andhra Pradesh

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

శ్రీకాకుళం ముచ్చట్లు:

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు అత్యవసర సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు అనే తేడా లేకుండా ఉచితంగా తక్షణమే వైద్యమందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా రోడ్డు భద్రతా కమిటీ ఛైర్మన్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పి.ఎం.రాహత్’ (ప్రధానమంత్రి రోడ్డు యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అస్యూర్డ్ ట్రీట్‌మెంట్) పథకం అమలపై ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రమాదం జరిగిన మొదటి గంట వ్యవధిలోనే బాధితులకు మెరుగైన వైద్యం అందించడం ద్వారా ప్రాణనష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానమై జిల్లాలో పి.ఎం.రాహత్ పథకం పక్కాగా అమలు జరుగుతోందని పేర్కొన్నారు. పోలీసు శాఖలో ప్రమాదాల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసేందుకు ఈ-డి.ఎ.ఆర్ విధానాన్ని ప్రాధాన్యతతో అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

‘పి.ఎం.రాహత్’ పథకం ద్వారా బాధితులకు గోల్డెన్ అవర్ (ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలు) లోనే అత్యవసర వైద్యం అందించేందుకు అవకాశం ఉందని, ఈ పథకంతో మొత్తం రూ. 1.5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్ చికిత్సను గరిష్టంగా 7 రోజుల వ్యవధికి సదుపాయం కల్పిస్తుందని కలెక్టర్ చెప్పారు. ఈ పథకంలో ఎలాంటి ముందస్తు డిపాజిట్, రిజిస్ట్రేషన్ దరఖాస్తులు లేకుండా కేవలం ప్రాథమిక గుర్తింపు ప్రాతిపదికన వైద్య సహాయం ప్రారంభమవుతుందని, జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు అన్ని రకాల రోడ్డు ప్రమాద బాధితులకు ఆయుష్మాన్ భారత్ అనుసంధాన ఆసుపత్రుల ద్వారా వైద్యం పొందే వీలుందని, బాధితులను కాపాడేందుకు ముందుకు వచ్చే ప్రత్యక్ష సాక్షులను, సహాయకులను (‘రాహ్-వీర్’) ఎలాంటి పోలీసు వేధింపులు లేదా చట్టపరమైన చిక్కులకు గురిచేయకుండా రక్షణ కల్పించే ‘గుడ్ సమరిటన్’ చట్టాన్ని దీనికి అనుసంధానించారు. అంతేకాకుండా, బాధితులు లేదా సహాయకులు 112 హెల్ప్‌లైన్ ద్వారా సమీపంలోని గుర్తింపు పొందిన ఆసుపత్రి, అంబులెన్స్ సేవలను తక్షణమే పొందే వెసులుబాటు ఉంటుందని వాటిని వినియోగించుకోవాలని చెప్పారు.

సమావేశంలో అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ల ఏకీకరణ, గుడ్ సమరిటన్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మరియు వైద్య రక్షణ ప్రోటోకాల్‌పై వివరంగా చర్చించారు. అత్యవసర సహాయం కోసం ఉద్దేశించిన 100, 101, 102, 1033, 1091 నంబర్లను ‘112’ హెల్ప్‌లైన్‌తో అనుసంధానించే ప్రక్రియ సాగుతోందని వెల్లడించారు. ప్రమాద సమయంలో ఆసుపత్రులకు చేరవేసే అంబులెన్సుల పనితీరు, జి.పి.యస్ నిఘా విధానాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. రోడ్డు భద్రత, ప్రథమ చికిత్సపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు 108 వాహన సిబ్బంది ద్వారా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సులభంగా అర్థం చేసుకునేలా తెలుగు భాషలోనే ప్రాథమిక ఆరోగ్య రక్షణ విధానాలపై ప్రదర్శనలు ఇస్తున్నామని తెలిపారు. ప్రమాద తీవ్రత ఆధారంగా బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా రిమ్స్ శ్రీకాకుళం, టెక్కలి జిల్లా ఆసుపత్రులలో రెండు ట్రామా కేర్ సెంటర్ల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని వెల్లడించారు. అంబులెన్స్ సిబ్బంది, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు ప్రాథమిక చికిత్సపై నిరంతరం శిక్షణ ఇస్తూ, ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రాణాలు కాపాడేలా యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్టీవో గంగాధర్, పలువురు డిఎస్పీలు, ఎన్ హెచ్ ఏ ఐ, ఆర్ అండ్ బి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హాజరయ్యారు.

Tags;Free medical treatment for road accident victims through ‘PM-RAHAT’