- నేరం రుజువు కావడంతో నిందితుడికి 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10,000/- జరిమానా.
- సమర్థవంతమైన దర్యాప్తు, పటిష్టమైన సాక్ష్యాధారాలతో నిందితుడికి శిక్ష పడేలా చర్యలు.
- కేసు దర్యాప్తు, కోర్టు ట్రయల్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించిన పోలీసు అధికారులు.
- కుటుంబ వివాదాలను హింసాత్మకంగా పరిష్కరించుకోవద్దని పోలీసుల సూచన.
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఆదేశాల మేరకు, రెనిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో కోడూరు రూరల్ సర్కిల్ పోలీసు అధికారులు కేసుల దర్యాప్తు, కోర్టు ట్రయల్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తూ నేరస్తులకు శిక్షలు పడేలా చర్యలు చేపడుతున్నారు.
2019 సంవత్సరంలో పుల్లంపేట మండలంలోని పుల్లారెడ్డిపల్లి హరిజనవాడలో పెద్దల ఆస్తిగా ఉన్న మేకల పంపకం విషయంలో అన్నదమ్ముల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా తమ్ముడు దాస్తోటి సుబ్రహ్మణ్యం (52), తన అన్న దాస్తోటి నారాయణ (55)పై మెలికల కొడవలితో దాడి చేయడంతో ఆయన గాయపడ్డారు.
ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి పుల్లంపేట ఎస్సై ఎస్. వినోద్ కుమార్ కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు. అనంతరం సమగ్ర దర్యాప్తు నిర్వహించి, నేరం రుజువు చేసే సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు.
కేసు విచారణలో భాగంగా రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో, కోడూరు రూరల్ సర్కిల్ సీఐ డి. శ్రీనివాసులు పర్యవేక్షణతో పుల్లంపేట ఎస్సై వి. చిన్నరెడ్డప్ప కోర్టుకు సాక్షులను హాజరుపరచి, కేసు ట్రయల్ సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలాజీ సమర్థవంతంగా వాదనలు వినిపించారు.
కేసులో సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన రాజంపేట అసిస్టెంట్ సెషన్స్ జడ్జి గౌరవ న్యాయమూర్తి నక్క లావణ్య , నిందితుడు దాస్తోటి సుబ్రహ్మణ్యం నేరానికి పాల్పడినట్లు నిర్ధారించారు. నిందితుడికి 7 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000/- జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
- పోలీసుల సూచన.
కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి, ఆర్థిక లేదా ఇతర వివాదాలు తలెత్తినప్పుడు వాటిని హింసాత్మకంగా పరిష్కరించుకోవద్దని, చట్టపరమైన మార్గాలను ఆశ్రయించాలని పోలీసులు సూచించారు. క్షణికావేశంలో హింసకు పాల్పడితే కేసులు నమోదై, నేరం రుజువైన పక్షంలో న్యాయస్థానం ద్వారా కఠినమైన శిక్షలు తప్పవని హెచ్చరించారు.
Tags: Jail term and fine for the accused in the case of attacking his elder brother with a sickle.