August 10, 2026
Explore
అమర జవాన్ మురళీ నాయక్ విగ్రహాన్ని ఆవిష్కరించిన  జిల్లా కలెక్టర్ ,ఎస్పీ

అమర జవాన్ మురళీ నాయక్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ,ఎస్పీ

August 10, 2026 | Andhra Pradesh

దేశం కోసం మురళీ నాయక్ చేసిన త్యాగం రాబోయే తరాలకు ప్రేరణదాయకం

అమర జవాన్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుంది

పుట్టపర్తి ముచ్చట్లు:

దేశ సరిహద్దు రక్షణలో ప్రాణాలను అర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన అమర జవాన్ మురళీ నాయక్ జ్ఞాపకార్థం పుట్టపర్తి శిల్పారామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ మరియు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శనివారం ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అమర జవాన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ”2025 మే 9న జమ్మూ కాశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ (LoC) వద్ద పాకిస్థాన్ బలగాలు జరిపిన కాల్పులను ధీటుగా ఎదుర్కొంటూ మురళీ నాయక్ అత్యున్నత త్యాగం చేశారు. చిన్న వయస్సులోనే దేశం కోసం ఆయన చేసిన ప్రాణత్యాగం వర్ణనాతీతం. ఆయన ధైర్యసాహసాలు, దేశభక్తి రాబోయే తరాలకు, జిల్లా యువతకు నిరంతరం ప్రేరణగా నిలుస్తాయి. అమర వీరుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు.”

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ”మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ అమరత్వం అమూల్యమైనది. సరిహద్దుల్లో మన సైనికులు అహర్నిశలు శ్రమిస్తుండటం వల్లే మనమందరం సురక్షితంగా ఉన్నాం. ఆయన వీరగాథను శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు.”ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ ,జిల్లా స్థాయి అధికారులు, ఆర్మీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అమర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు,కుటుంబ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అమర వీరుడికి శ్రద్ధాంజలి ఘటించారు.

Tags:District Collector and SP unveil the statue of martyred soldier Murali Naik.