August 10, 2026
Explore
రూ.6 కోట్ల హనీట్రాప్.. అందమే వల… ‘డేటింగ్’ చాటున భారీ దందా!

రూ.6 కోట్ల హనీట్రాప్.. అందమే వల… ‘డేటింగ్’ చాటున భారీ దందా!

August 10, 2026 | Andhra Pradesh

యూపీ ముచ్చట్లు:

కంటపడితే చాలు మతిపోవాల్సిందే… మాటల మంత్రదండంతో మైమరపించాల్సిందే.. ఆకర్షణీయమైన రూపం, తీయని మాటలను పెట్టుబడిగా మార్చుకున్న ఒక యువతి… అమాయకులైన పురుషులను బురిడీ కొట్టించి ఏకంగా రూ.6 కోట్లు నొక్కేసింది.

డేటింగ్ యాప్ ఆధారంగా ‘హనీట్రాప్’ పరుస్తూ, అంతా అనుకూలించాక వేధింపులకు దిగుతున్న కిలాడీ లేడీ గుట్టును పోలీసులు ఎట్టకేలకు రట్టు చేశారు.

యూపీకి చెందిన సదరు భామ వలలో చిక్కి ప్రముఖులు, వ్యాపారులు విలవిలలాడగా… చివరకు ఒక హైకోర్టు న్యాయవాది ఇచ్చిన ధైర్యంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

చాటింగ్‌తో మొదలై… రికార్డింగ్‌తో ముగిసి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉత్తరప్రదేశ్‌కు చెందిన పల్లవి సింగ్ అనే యువతి ప్రముఖ డేటింగ్ యాప్స్‌లో నకిలీ, ఆకర్షణీయమైన ప్రొఫైళ్లు సృష్టించింది.

యాప్‌లో పరిచయమైన పురుషులతో మొదట చనువుగా మాట్లాడేది. బాధితుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ వారిని ఏకాంతంగా కలవడానికి ఆహ్వానించేది.

ఆ సమయాన్ని ఆసరాగా చేసుకుని, బాధితులకు తెలియకుండా వీడియోలు, ఫోటోలను రహస్యంగా రికార్డు చేసేది.

తీరా పని పూర్తయ్యాక తన అసలు రూపాన్ని బయటపెట్టేది. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పెడతానని, కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరింపులకు దిగేది.

సమాజంలో పరువు పోతుందనే భయంతో బాధితులు ఆమె అడిగినంత సమర్పించుకునేవారు. అలా ఇప్పటివరకు బాధితుల నుంచి ఏకంగా రూ.6 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

ఎదురు తిరిగితే చిక్కుల్లోకి…
ఈ బ్లాక్‌మెయిలింగ్ దందాకు భయపడకుండా ఎవరైనా ఎదురు తిరిగితే పల్లవి సింగ్ వారిపై ఎదురుదాడికి దిగేది. వారిపై లైంగిక వేధింపులు, అత్యాచారం యత్నం వంటి తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపించేది. దీంతో బాధితులు భయపడి ఆమె అడిగిన డబ్బులు చెల్లించేవారని సమాచారం.

వెలుగులోకి తెచ్చిన లాయర్ ఫిర్యాదు!
ఇటీవల ఒక హైకోర్టు లాయర్‌ను సైతం ఇలాగే ట్రాప్ చేసి బెదిరించడంతో ఈ వ్యవహారం మలుపు తిరిగింది. ఆ బెదిరింపులకు లొంగని సదరు న్యాయవాది, పక్కా ఆధారాలతో పోలీసులను ఆశ్రయించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా… పల్లవి సింగ్ నడిపిస్తున్న ఈ భారీ హనీట్రాప్ నెట్‌వర్క్ గుట్టు వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ కిలాడీ లేడీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

Tags: Rs 6-crore honey trap… beauty as the bait… a massive racket under the guise of ‘dating’!