అమెరికా ముచ్చట్లు:
ఉద్యోగంలో చేరిన ఐదు నెలలకే ఈ దుర్ఘటన
మృతుడు తిరుపతి జిల్లా చిట్వేల్ మండలానికి చెందిన దిలీప్ కుమార్
మృతదేహం తరలింపునకు ఐదు రోజులు పట్టే అవకాశం
అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించి, ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడనుకున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం జట్టివారిపల్లె గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ (26) అమెరికాలో జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.
ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లిన దిలీప్, కెంట్ స్టేట్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి ఐదు నెలల క్రితమే ఒక సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. తన స్నేహితుడిని విమానాశ్రయంలో దించి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఒహాయో రాష్ట్రంలోని మాసిడోనియా ప్రాంతంలో దిలీప్ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వేగంగా వచ్చిన ఓ పికప్ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దిలీప్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
దిలీప్ మరణవార్త తెలియగానే జట్టివారిపల్లెలోని ఆయన తల్లిదండ్రులు బంగటవుల శ్రీహరి, చాముండి కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రస్తుతం అమెరికాలో వారాంతపు సెలవులు కావడంతో, దిలీప్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకురావడానికి మరో ఐదు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.
ఈ విషాద ఘటనపై న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ స్పందించింది. మృతుడి కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, భౌతికకాయాన్ని భారత్‌కు తరలించేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని అధికారులు వెల్లడించారు.
Tags: Horrific road accident in the US; young engineer from AP killed.