August 10, 2026
Explore
మెడికో ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు

మెడికో ప్రియాంక కుటుంబానికి రూ.20 లక్షల సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు

August 10, 2026 | Andhra Pradesh

రాజమండ్రి ముచ్చట్లు:

ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

నిందితులపై కఠిన సెక్షన్లు నమోదు చేయాలని అధికారులకు ఆదేశం

బాధిత కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని ప్రభుత్వ భరోసా

రాజమండ్రిలో కారు ఢీకొట్టిన ఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రూ. 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆమె మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని, ఈ ఘటన అత్యంత విషాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి తక్షణమే రూ. 20 లక్షల సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై తాను ఇప్పటికే జిల్లా అధికారులతో సమీక్షించానని గుర్తుచేశారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారికి కఠిన శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు.

ఈ కేసులో నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపినట్టు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ వివరించారు. దీనిపై స్పందించిన సీఎం, నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న వారికి కఠిన శిక్ష పడేలా బలమైన సెక్షన్లు నమోదు చేయాలని సూచించారు.

రాజమండ్రిలో ఆగస్టు 3న కొందరు యువకులు వేగంగా నడుపుతున్న కారు ఢీకొని వైద్య విద్యార్థిని ప్రియాంక తీవ్రంగా గాయపడడం తెలిసిందే. తొలుత రాజమండ్రిలోనే ఆమెకు చికిత్స అందించినప్పటికీ, మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది.

Tags: CM Chandrababu announces ₹20 lakh aid for medico Priyanka’s family.