…ఎప్పుడైనా నిర్వహించే అవకాశం ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
పురపాలక, పంచాయతీరాజ్ శాఖల అధికారులకు ఎస్ఈసీ పునేఠా ఆదేశం
అమరావతిముచ్చట్లు:
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిలచంద్ర పునేఠా పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల అధికారులను ఆదేశించారు. ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికలకు ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లు, పెండింగ్లోని అంశాలు, వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు తదితరాలపై ఎస్ఈసీ గురువారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘ కార్యాలయంలో పురపాలక, పంచాయతీరాజ్శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు.
పురపాలికల్లో కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు
మొత్తం 123 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలకూ ఎన్నికలు నిర్వహించే యోచనతో ఉన్నామని.. కొన్నిచోట్ల ప్రతిబంధకంగా ఉన్న కోర్టు కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ వివరించారు. పెండింగ్లో ఉన్న 23 కోర్టు కేసుల్లో ఇప్పటికే నాలుగు పరిష్కారమయ్యాయన్నారు. జనాభా ఆధారంగా డివిజన్లు, వార్డుల పునర్విభజనకు సంబంధించిన కేసులో త్వరలో తీర్పు వెలువడనుందని చెప్పారు. ఓటర్ల తుది జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపైనా సిబ్బందిని సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు.
పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రచురించాం..
మొత్తం 13,359 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఇప్పటి వరకు చేసిన ఏర్పాట్లు, న్యాయపరమైన చిక్కులు తదితర అంశాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ప్రజంటేషన్ ఇచ్చారు. కోర్టు కేసులతో 2021లో 354 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేదన్నారు. పురపాలకశాఖతో సమన్వయం చేసుకుని పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా ప్రచురణ పూర్తయిందని, పోలింగ్ కేంద్రాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించారు.
ఈవీఎంలా.. బ్యాలట్ బాక్సులా?…
ఎన్నికలకు బ్యాలట్ బాక్సులు వినియోగించాలా, ఈవీఎంలు వాడాలా అనే అంశంపై సమావేశంలో చర్చించారు. జిల్లాల వారీగా ఉన్న బ్యాలట్ బాక్సులు, ఈవీఎంల వివరాలను అధికారులు నివేదించారు.
2021లో స్థానిక ఎన్నికల నిర్వహణకు రూ.3.50 కోట్ల వరకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. ఈసారి ఎన్నికల ఖర్చుపైనా పురపాలక, పంచాయతీరాజ్ శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించారు.
ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాక మరోసారి సమావేశమై ఏర్పాట్లపై చర్చించాలని నిర్ణయించారు. ఈలోగా పెండింగ్పనులన్నీ పూర్తి చేయాలని, జిల్లాల వారీగా ఎన్నికలకు సన్నద్ధతపై అధికారులను సమాయత్తం చేయాలని ఆదేశించారు.
Tags: Be prepared for the local elections.