కుప్పం ముచ్చట్లు:
భార్య హత్య ప్రణాళిక
సమయస్ఫూర్తితో తప్పించుకున్న భర్త
వివరాల్లోకి వెళితే..
ఒక్క రాంగ్ కాల్ ఒక పచ్చని సంసారంలో చిచ్చు రేపింది. పదేళ్ల బంధాన్ని, ఇద్దరు పిల్లల భవిష్యత్తును మరిచిపోయిన ఒక వివాహిత, రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన ప్రియుడి మోజులో పడి భర్తనే కడతేర్చడానికి పక్కా ప్లాన్ వేసింది. అయితే భర్త సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఈ కిలాడీ లేడీ ప్లాన్ తిరగబడింది. కుప్పం నియోజకవర్గంలో వెలుగు చూసిన ఈ ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. గుడుపల్లి మండలం గుడి కొత్తూరుకు చెందిన చిరంజీవికి, శాంతిపురం మండలం బియ్యం గొల్లపల్లికి చెందిన శోభతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఎంతో ఆనందంగా సాగుతున్న వీరి కాపురంలోకి మూడు నెలల క్రితం ఒక రాంగ్ కాల్ తుపానులా వచ్చింది. గుంటూరు జిల్లా కండ్రిగ గ్రామానికి చెందిన బాలాజీ నాయక్ అనే వ్యక్తితో రాంగ్ కాల్ ద్వారా శోభకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా అనైతిక సంబంధానికి దారితీసింది. ప్రియుడి మోజులో పడిన శోభ, నెల రోజుల క్రితం భర్త, పిల్లలను వదిలేసి బాలాజీ నాయక్‌తో కలిసి పారిపోయింది. భార్య అదృశ్యం కావడంపై చిరంజీవి గుడుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.
హత్యకు పక్కా స్కెచ్ :
ఇదిలా ఉండగా, భర్త చిరంజీవిని అడ్డు తొలగించుకుంటేనే తాము ప్రశాంతంగా జీవించగలమని శోభ భావించింది. ఎలాగైన భర్తను చంపాలని మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల అన్నమయ్య జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఘటనను గుర్తుతెచ్చుకున్న చిరంజీవి.. అప్రమత్తమయ్యాడు. తన ప్రాణాలకు, పిల్లల భవిష్యత్తుకు ప్రమాదం ఉందని గ్రహించి.. సేఫ్ జోన్‌లో ఉంటూనే భార్య ఆచూకీ కోసం గాలింపు చేపట్టాడు.
పెద్దల పంచాయితీలో బయటపడ్డ అసలు నిజం :
ఈ క్రమంలో శోభ, బాలాజీ నాయక్ ఇద్దరూ బెంగిలపల్లిలో కాపురం పెట్టినట్లు చిరంజీవి గుర్తించాడు. కుప్పంలోని తిరుపతి గంగమ్మ గుడిలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకుని, బంధువులు, స్థానికుల సహాయంతో శోభ, బాలాజీలను పట్టుకున్నాడు. వారిని గ్రామంలోని గుడి వద్ద పెద్దల పంచాయితీ ముందు నిలబెట్టారు. పోలీసులకు కూడా సమాచారం అందించారు. పంచాయితీలో గ్రామ పెద్దలు వారిని విచారించగా అసలు దారుణం వెలుగులోకి వచ్చింది. శోభనే తనను ఇక్కడికి రప్పించి, భర్త చిరంజీవిని చంపేందుకు ప్లాన్ చేసిందని ప్రియుడు బాలాజీ నాయక్ అందరి ముందే ఒప్పుకోవడంతో శోభ నిర్వాకం విస్తుపోయేలా చేసింది.
పోలీసుల తీరుపై విమర్శలు :
సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలు కాపాడుకున్న చిరంజీవి ఊపిరి పీల్చుకున్నాడు. కాగా ఈ ఘటనపై కుప్పం డీఎస్పీ పార్థసారథి విచారణ చేపట్టారు. అయితే మొదట మిస్సింగ్ కేసును సీరియస్‌గా తీసుకోకపోవడం, ఆ తర్వాత ఆచూకీ దొరికినా గుడుపల్లి పోలీసులు సరైన రీతిలో స్పందించకపోవడంపై స్థానికులు, పెద్దల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Tags: With just one wrong call…!! Another incident in AP.