సీఎస్‌ఆర్ నిధులతో హెల్త్ స్కీమ్ ప్రీమియం చెల్లింపుపై సానుకూల స్పందన
తిరుపతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (ఎపిడబ్ల్యూజెఎఫ్), ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఎపిబిజెఎ) సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్‌కు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు నిర్వహించిన “డిమాండ్స్ డే” కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి పలు కీలక డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
జిల్లాలోని జర్నలిస్టులకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలని, జర్నలిస్టుల ఉద్యోగ భద్రత, పని పరిస్థితులు, సంక్షేమ అంశాలపై అధ్యయనం చేసేందుకు హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల తరహాలో జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు, నిలిచిపోయిన ‘ఆంధ్రప్రదేశ్’ మాసపత్రిక పునరుద్ధరణ, సమాచార శాఖను 28 జిల్లాలకు అనుగుణంగా బలోపేతం చేయడం, ఏసీ బస్సుల్లో రాయితీ ప్రయాణ సౌకర్యం కల్పించడం, వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ ఫండ్ కమిటీ పునరుద్ధరణతో పాటు రూ.50 కోట్ల నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా సి. రాఘవాచారి మీడియా అకాడమీకి గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు, నిలిచిపోయిన జర్నలిస్టు అవార్డుల పునరుద్ధరణ, అసంఘటిత రంగ కార్మికులకు అమలవుతున్న బీమా పథకాన్ని జర్నలిస్టులకు కూడా వర్తింపజేయడం, వృద్ధ జర్నలిస్టుల కోసం ప్రత్యేక వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలని కోరారు.
జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ కోసం అక్రిడిటేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టు చెల్లించే రూ.1,250 ప్రీమియాన్ని సీఎస్‌ఆర్ నిధుల ద్వారా భరించేలా చర్యలు తీసుకోవాలని కోరగా, కలెక్టర్ వెంకటేశ్వర్ సానుకూలంగా స్పందించారు. తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని, మిగిలిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎపిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి. చెంగల్రాయులు (గాంధీ), ఎపిబిజెఎ జిల్లా అధ్యక్షుడు కిరణ్, ఎపిడబ్ల్యూజెఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి, జిల్లా ఉపాధ్యక్షుడు పానేటి చెంగల్రాయులు యాదవ్, కోశాధికారి కె. శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు సీబీ మోహన్‌రావు, నాయకులు సుకుమార్, సుధీర్, మణి, కృష్ణమూర్తి, వర్మ, వినోద్, రాధాదేవి, పి. యాసిన్ తదితరులు పాల్గొన్నారు.
Tags:Representation submitted to the Collector to address journalists’ issues.