July 26, 2026
Explore
డీసెట్ కౌన్సిలింగ్‌కు 51 మంది హాజరు

డీసెట్ కౌన్సిలింగ్‌కు 51 మంది హాజరు

July 26, 2026 | Andhra Pradesh


– జూలై 29 వరకు తొలి విడత ప్రవేశాలు
– డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి వెల్లడి

రాయచోటి ముచ్చట్లు:

2026–2028 విద్యా సంవత్సరానికి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డి.ఎల్.ఎడ్.) కోర్సులో ప్రవేశాల కోసం రాయచోటి డైట్‌లో నిర్వహిస్తున్న తొలి విడత కౌన్సిలింగ్‌కు ఆదివారం నాటికి మొత్తం 51 మంది అభ్యర్థులు హాజరైనట్లు డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయచోటి డైట్‌లో తెలుగు మాధ్యమంలో 50 సీట్లకు గాను 17 మంది, ఆంగ్ల మాధ్యమంలో 50 సీట్లకు గాను 9 మంది, ఉర్దూ మాధ్యమంలో 50 సీట్లకు గాను 16 మంది అభ్యర్థులు ప్రవేశం పొందినట్లు తెలిపారు. అలాగే బద్వేల్‌లోని ఎస్‌వీసిఎం ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్లో ఆంగ్ల మాధ్యమం 50 సీట్లకు గాను 9 మంది అభ్యర్థులు ప్రవేశం పొందినట్లు వెల్లడించారు.

తొలి విడత కౌన్సిలింగ్ ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగుతుందని, అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా హాజరై ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసుకోవాలని సూచించారు. ధృవపత్రాల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులకు వెంటనే ప్రవేశపత్రాలు అందజేస్తున్నట్లు తెలిపారు.

ధృవపత్రాల పరిశీలన కార్యక్రమంలో అధ్యాపకులు వెంకట సుబ్బారెడ్డి, శివప్రసాద్, గిరిబాబు యాదవ్, కేదార్నాథ్, వై.సి. రెడ్డప్ప రెడ్డి, మోహన్ నాయక్, కార్యాలయ సిబ్బంది జగదీష్, తిరుమలరావు, రవికిరణ్, వెంకటేష్, అనర్, శ్వేత తదితరులు పాల్గొన్నారు.

Tags: 51 candidates attended the DEECET counselling.