కైకలూరు ముచ్చట్లు:
ఆస్తి వివాదంతో మనస్తాపం చెందిన ఓ మహిళ గుడివాడ పట్టణంలోని నెహ్రూ చౌక్ అంబేద్కర్ విగ్రహం వద్ద పాయిజన్ టాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కైకలూరు మండలం చావలిపాడు గ్రామానికి చెందిన తలారి రమాదేవి(50) ఈరోజు ఉదయం గుడివాడకు వచ్చి అంబేద్కర్ విగ్రహం వద్ద నమస్కరించి తాను తెచ్చుకున్న పాయిజన్ టాబ్లెట్లు మింగింది. సమీపంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది వెంటనే గమనించి ఆమెను గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది.
బాధితురాలు రమాదేవి తెలిపిన వివరాల ప్రకారం… చావలిపాడులో వంశపారంపర్యంగా వస్తున్న భూమిని తన బాబాయి మరియు అతని కుమారుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయమై కోర్టులో సివిల్ కేసు కూడా నడుస్తోందని, సీఎంను కలవగా ఎమ్మెల్యేను కలవాలని సూచించారని, అయితే ఎమ్మెల్యే అందుబాటులో లేరని వాపోయారు. తమకు న్యాయం జరగడం లేదన్న ఆవేదనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఉపాధి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు. ఈ ఘటనపై గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Woman attempts suicide at Nehru Chowk in Gudivada…