అమరావతిముచ్చట్లు:
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దమవుతోంది.
వీటికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఇవాళ వెల్లడించింది. వీటి ప్రకారం పురపాలక ఎన్నికలతో స్థానిక పోరు ప్రారంభం కాబోతోంది. అనంతరం వరుసగా మిగిలిన స్థానిక సంస్ధల్లోనూ ఎన్నికలు నిర్వహించబోతున్నారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్ని సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టాలని ప్రభుత్వం ఇవాళ నిర్ణయించింది. ఇందులో భాగంగా ముందుగా మున్సిపల్ ఎన్నికలను సెప్టెంబర్‌లో నిర్వహించాలని భావిస్తున్నారు. పురపాలక ఎన్నికల తర్వాత వరుసగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి. అనంతరం పంచాయితీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇందుకోసం పార్టీ శ్రేణుల్ని సిద్దం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 27వ తేదీ నుంచి 45 రోజుల పాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందుగానే చేపట్టాల్సిన కార్యక్రమాలపై చంద్రబాబు పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇందులో నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు ప్రభుత్వ పథకాలపై ఇంటింటి ప్రచారాల నిర్వహణ, వైసీపీ ప్రచారాలను తిప్పికొట్టడం వంటివి ఉన్నాయి. వీటిని త్వరగా పూర్తి చేస్తే సెప్టెంబర్ లో స్ధానిక ఎన్నికలు ప్రారంభిద్దామని చంద్రబాబు పార్టీ జోనల్ కోఆర్డినేటర్లు, ఇతర నేతలకు చెప్పారు. దీంతో ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు పూర్తి స్ధాయిలో సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Tags: Local body elections in AP to begin in September.