July 17, 2026
Explore
ఏపీలో ఈ నెల 22న ‘తల్లికి వందనం’ నిధులు విడుదల… మార్గదర్శకాలు ఇవే!

ఏపీలో ఈ నెల 22న ‘తల్లికి వందనం’ నిధులు విడుదల… మార్గదర్శకాలు ఇవే!

July 17, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

తల్లికి వందనం’ పథకానికి రూ.10,120.78 కోట్లు మంజూరు

42.70 లక్షల మంది తల్లులు, 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి బిడ్డకు రూ.15,000 ఆర్థిక సాయం

పాఠశాల నిర్వహణ కోసం రూ.2,000 మినహాయింపు, తల్లి ఖాతాలో రూ.13,000 జమ

2026-27 విద్యా సంవత్సరానికి పథకం అమలుకు ఉత్తర్వులు

పథకానికి అర్హతలు ఇవే:

‘తల్లికి వందనం’ పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం స్పష్టమైన అర్హత నిబంధనలను నిర్దేశించింది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు (SGSW) శాఖ ఆరు దశల ధ్రువీకరణ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది.

ఆదాయం: గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలసరి ఆదాయం రూ.10,000, పట్టణ ప్రాంతాల్లో రూ.12,000 మించకూడదు.
భూమి: మాగాణి అయితే 3 ఎకరాల లోపు, మెట్టభూమి అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. రెండూ కలిపి ఉన్నా 10 ఎకరాల పరిమితికి లోబడే ఉండాలి.
వాహనం: కుటుంబంలో ఎవరి పేరు మీదా నాలుగు చక్రాల వాహనం ఉండరాదు. అయితే, టాక్సీ, ట్రాక్టర్, ఆటోలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు.
విద్యుత్ వినియోగం: కుటుంబం నెలసరి విద్యుత్ వినియోగం సగటున 300 యూనిట్లకు మించరాదు. దీని కోసం గత 12 నెలల సగటును పరిగణనలోకి తీసుకుంటారు.
ఆస్తి: పట్టణ ప్రాంతాల్లో నివసించే కుటుంబానికి 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో మున్సిపల్ ఆస్తి ఉండకూడదు.
ప్రభుత్వ ఉద్యోగం: కుటుంబ సభ్యుల్లో ఎవరూ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా లేదా ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగిగా ఉండరాదు. ప్రభుత్వ పింఛనుదారులకు కూడా ఇది వర్తించదు. పారిశుధ్య కార్మికులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, నిర్దేశిత ఆదాయ పరిమితి లోపు జీతం తీసుకునే వారికి మినహాయింపు ఉంటుంది.
ఆదాయ పన్ను: కుటుంబంలో ఏ ఒక్క సభ్యుడు కూడా ఆదాయపు పన్ను చెల్లింపుదారుగా ఉండకూడదు.
చదువు: విద్యార్థులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాల/జూనియర్ కళాశాలలో చదువుతూ ఉండాలి. ఐటీఐ, పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ వంటి ఫీజు రీయింబర్స్‌మెంట్ పొందే కోర్సులకు ఈ పథకం వర్తించదు.

Tags: ‘Thalliki Vandanam’ funds to be released in AP on the 22nd of this month… Here are the guidelines!