తిరుపతి ముచ్చట్లు:
- జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆధ్వర్యంలో రౌడీషీటర్లు, పునరావృత నేరస్థులపై ప్రత్యేక నిఘా.
- జిల్లాలో తొలిసారిగా బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీషీటర్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.
- బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ఇకపై మరింత కఠిన చర్యలు.
- చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్న జిల్లా పోలీసుల హెచ్చరిక.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న తిరుపతి జిల్లా పోలీసు శాఖ, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఆధ్వర్యంలో నేర నియంత్రణకు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. జిల్లా వ్యాప్తంగా పదేపదే నేరాలకు పాల్పడే వ్యక్తులు, రౌడీషీటర్లు, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని గుర్తించి వారిపై చట్టపరమైన నిరోధక చర్యలు అమలు చేస్తున్నారు.
ఈ చర్యల్లో భాగంగా, నేరప్రవృత్తికి దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించేలా ఆయా మండలాల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌లు (తహశీల్దార్లు) ఎదుట బైండ్ ఓవర్ చేయిస్తున్నారు. బైండ్ ఓవర్‌లో విధించిన నిబంధనలను ఉల్లంఘించి తిరిగి నేరాలకు పాల్పడిన వారిపై తగిన ఆధారాలతో సంబంధిత ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌ల ఎదుట హాజరుపరచి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన హత్య కేసులో నిందితుడిగా ఉన్న రేణిగుంట మండలం, కరకంబాడి పంచాయతీ, తారకరామ నగర్‌కు చెందిన సేతు దిలీప్ కుమార్ @ తంబి (35) అనే రౌడీషీటర్‌ను, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో, రేణిగుంట ఇన్‌స్పెక్టర్ ఎస్. జయచంద్ర 13-04-2026న రేణిగుంట మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ శ్రావణ్ కుమార్ ఎదుట బైండ్ ఓవర్ చేయించారు.
అయితే, బైండ్ ఓవర్‌లో ఉన్నప్పటికీ 06-07-2026న తారకరామ నగర్‌లో జరిగిన కొట్లాట ఘటనలో మళ్లీ పాల్గొన్నట్లు విచారణలో నిర్ధారణ కావడంతో, నిబంధనలను ఉల్లంఘించినందుకు 16-07-2026న అతడిని తిరిగి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచి తగిన ఆధారాలను సమర్పించారు. విచారణ అనంతరం నిబంధనల ఉల్లంఘనను పరిగణనలోకి తీసుకుని అతడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో బైండ్ ఓవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీషీటర్‌పై ఈ విధంగా జ్యుడీషియల్ రిమాండ్ విధించడం ఒక కీలక చర్యగా పోలీసులు పేర్కొన్నారు. ఇటువంటి చర్యలు పునరావృత నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు,., మాట్లాడుతూ…ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే తిరుపతి జిల్లా పోలీసు శాఖ ప్రథమ కర్తవ్యం. చట్టాన్ని గౌరవించే ప్రతి పౌరుడికి పోలీసులు అండగా ఉంటారు. అయితే చట్టాన్ని చేతిలోకి తీసుకుని ప్రజల్లో భయాందోళనలు సృష్టించే రౌడీషీటర్లు, పునరావృత నేరస్థులు, సంఘవిద్రోహ శక్తులపై ఎలాంటి ఉపేక్ష ఉండదు. అవసరమైన ప్రతి చట్టపరమైన చర్యను నిర్భయంగా, నిర్దాక్షిణ్యంగా అమలు చేస్తాం.మున్ముందు కూడా జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇటువంటి కఠిన చర్యలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ చర్యను సమర్థవంతంగా అమలు చేసిన రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ని, రేణిగుంట ఇన్‌స్పెక్టర్ ఎస్. జయచంద్ర ని మరియు కేసులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
Tags: Another key step by the Tirupati district police in maintaining law and order in the district.