July 15, 2026
Explore
అధికారులు గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

అధికారులు గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

July 15, 2026 | Andhra Pradesh

  • స్పందించని అధికారులపై చట్టపరమైన చర్యలు తప్పవు
  • రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప

రామసముద్రం ముచ్చట్లు:

గిరిజనుల సమస్యలను అధికారులు తక్షణమే పరిష్కరించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వెంకటప్ప అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించి గిరిజనుల సమస్యలను పట్టించుకోని అధికారులపై ఎస్టీ కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని పెద్దకురప్పల్లె, ఎం.గొల్లపల్లి గ్రామాల్లో బుధవారం పర్యటించిన వెంకటప్ప అధికారులతో కలిసి గ్రామస్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బాణాసంచా కాల్చి, పూలమాలలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. మండల అధికారులు, గ్రామస్తులు కలిసి శ్రీ వెంకటేశ్వరస్వామి జ్ఞాపికను అందజేసి దుశ్యాలువతో సత్కరించారు. అనంతరం ఎం.గొల్లపల్లి గ్రామంలోని ఏకలవ్యుని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వెంకటప్ప, గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గిరిజనులకు విద్య, ఉపాధి, సంక్షేమ రంగాల్లో అందాల్సిన అన్ని ప్రయోజనాలు చేరేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.ప్రతి నెలలో కనీసం ఒకసారి గిరిజన గ్రామాలను అధికారులు తప్పనిసరిగా సందర్శించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. మండల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకువస్తే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహమ్మద్ అజారుద్దీన్, ఎంపీడీవో లతీఫ్ ఖాన్, ఆర్ఐ వసీం, ఎంఈఓ హేమలత, ఏపీఎం సాంబశివ, వ్యవసాయ అధికారి జాఫర్, ఏపీవో మాధవి, ఎస్సై హృషికేశవరెడ్డి, ఏఈ మస్తాన్ వలి, హౌసింగ్ ఏఈ రాజేశ్వరి, తేజస్విని, ఎస్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, మండల అధ్యక్షుడు ఈశ్వరప్ప, అమరప్ప, సింగంవారిపల్లి రామకృష్ణతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags: Officials must immediately resolve the problems faced by the tribals.