కే.వి.పల్లి ముచ్చట్లు:
కే.వి.పల్లి మండలం గ్యారంపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో డొనేషన్ల పేరుతో విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దెల అమృత్ తేజ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) సుబ్రహ్మణ్యంకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో డొనేషన్ల వసూళ్లపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించి, గత ఐదేళ్లలో సేకరించిన నిధులు, వాటి వినియోగం, బ్యాంకు ఖాతాల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేసిన మైనర్ విద్యార్థిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన డీఈఓ సుబ్రహ్మణ్యం ఈ వ్యవహారంపై ఇప్పటికే ప్రధానోపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు వెల్లడించారు. వినతిలో పేర్కొన్న అంశాలన్నింటినీ విచారణలో పరిగణనలోకి తీసుకుని నిబంధనల ప్రకారం సమగ్ర విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు అమృత్ తేజ తెలిపారు.
Tags: Comprehensive inquiry into allegations of collecting money.