: సబ్ డీఎఫ్‌వో శ్రీనివాసులు
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పెద్దపులి, చిరుత సంచరిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు పూర్తిగా అవాస్తవమని, ప్రజలు అలాంటి వదంతులను నమ్మవద్దని మదనపల్లె సబ్ డీఎఫ్‌వో శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం మదనపల్లెలోని సబ్ డీఎఫ్‌వో కార్యాలయంలో పీటీఎం మండలం రాపూరివాండ్లపల్లెకు చెందిన డిగ్రీ విద్యార్థి మంజునాథ్‌కు అటవీశాఖ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు.
రెండు రోజుల క్రితం మంజునాథ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యాప్ ద్వారా పొలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు డీప్‌ఫేక్ ఫొటో రూపొందించి వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై అటవీశాఖ మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు బురకాయలకోట ఎఫ్‌ఎస్‌వో సుధాకర్, డీఆర్‌వో శివకుమార్ ఆధ్వర్యంలో అధికారులు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారని చెప్పారు. పెద్దపులి ఆనవాళ్లు ఎక్కడా లేవని, వైరల్ అయిన ఫొటో పూర్తిగా నకిలీదేనని నిర్ధారించినట్లు వెల్లడించారు.
అనంతరం సంబంధిత విద్యార్థితో పాటు గ్రామ రైతులకు అవగాహన కల్పించి, తప్పుడు ప్రచారాల వల్ల ప్రజల్లో భయాందోళనలు ఏర్పడతాయని వివరించినట్లు తెలిపారు. గత వారం ఆరోగ్యవరం ప్రాంతంలో కూడా చిరుత సంచరిస్తోందంటూ ఇలాంటి వదంతులు వ్యాపించాయని గుర్తుచేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్ చిత్రాలు ప్రచారం చేసి ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Tags; Do not believe rumors about the movement of tigers and leopards.