July 10, 2026
Explore
వంతెనలు…..శిధిలాలు…

వంతెనలు…..శిధిలాలు…

July 10, 2026 | Andhra Pradesh


పుంగనూరులో రహదారి వంతెనలు కూలిపోతోంది.
-చలనం లేని మున్సిపల్‌, రహదారులశాఖ

పుంగనూరుముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలో శతాబ్దంక్రితం జమీందారుల కాలంలో నిర్మించిన రహదారి వంతెనలు కూలిపోతున్నాయి. ఈ వంతెనలు నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతున్న మున్సిపల్‌, రహదారులశాఖాధికారుల్లో చలనం లేకపోవడంపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణానికి నిత్యం వేలాది మంది ప్రజలు , వందలాది వాహనాలు వచ్చిపోతుంటాయి. పట్టణం నుంచి పుంగమ్మ చెరువు కట్టపై బెంగళూరు, చింతామణికి వెళ్లే రహదారి ఉంది. ఈ రహదారిపై గల వంతెన పూర్తిగా శిధిలావస్థకు చేరుకుంది. అలాగే పట్టణంలోని గోకుల్‌ సర్కిల్‌ నుంచి తిరుపతికి వెళ్లే ప్రధాన రహదారిపై కొత్తపేట క్రాస్‌లో ఉన్న వంతెన కూలిపోతోంది. ఎంబిటి రోడ్డు జాతీయ రహదారిపై పట్టణ ప్రైవెటు బస్టాండ్‌ సమీపంలో కౌండిన్యనది పై గల వంతెన కూడ శిధిలావస్థకు చేరుకుంది.

నిత్యం రద్దీ….

ఈ రహదారులపై బస్టాప్‌లు, ఆటో స్టాండ్‌లు ఉండటంతో వేలాది మంది విద్యార్థులు, ప్రజలు బస్సులు, ఆటోలలో రావడం, గమ్యాలకు చేరుకోవడానికి ఇక్కడ వేచి ఉంటారు. ఇప్పటికే వంతెనల పిట్టగోడలు కూలిపోయాయి. పట్టణానికి వచ్చిపోయే బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహన దారులు ఏమరుపాటున రెండు వాహనాలు ఒక్కసారిగా వచ్చిన లేదా ఎదురెదురుగా వచ్చిన ప్రమాదాలు జరిగితే ఊహించలేం. వంతెనలకు పిట్టగోడలు లేకపోవడంతో వాహనాలు చెరువులో, కౌండిన్యనది వంకలో పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ రహదారి వంతెనలపై పలు ప్రమాదాలు జరగడంతో ఆప్రాంతంలోని ఆటో డ్రైవర్లు , స్థానికులు కలసి మరమ్మతులు చేపట్టారు. కానీ ఫలితం లేకపోయింది. ఇకనైన మున్సిపల్‌, ఆర్‌అండ్‌బి అధికారులు వెంటనే స్పందించి , వంతెనలను పునః నిర్మించాలని, పిట్టగోడలు నిర్మించాలని, లేదా ఐరన్‌ గరండాలను వంతెనలపై ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండ నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

అధికారులు పట్టించుకోవడం లేదు…

పట్టణంలోని మూడు రహదారులపై గల వంతెనలు శిధిలావస్థలో ఉన్న అధికారులు పట్టించుకోకపోవడం బాధకరం. వైఎస్సార్‌సిపి ప్రభుత్వంలో మంజూరైన పనులను ఆపివేశారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటిన పనులు చేపట్టడంలో విఫలమైయ్యారు. ఇప్పటికైన శిధిలావస్థలో ఉన్న వంతెనల మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగకుండ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం.

-అలీమ్‌బాషా, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌. పుంగనూరు.

ప్రమాదాలకు నిలయం….

పట్టణంలోని రామసముద్రం రోడ్డు, తిరుపతి రోడ్డు , చిత్తూరు రోడ్డులో గల వంతెనలు శిధిలావస్థకు చేరుకుని , ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. చిత్తూరు రోడ్డు వంతెనపై గల ఆక్రమణలను తొలగించడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆక్రమించారు. మున్సిపల్‌, ఆర్‌అండ్‌బి అధికారులు నిర్లక్షం ఎక్కువైంది. ప్రజల భాగోగులను పట్టించుకోవడంలో అధికారులు విఫలమైయ్యారు. ఇకనైన వంతెనలు మరమ్మతులు చేయాలి.

  • పూలత్యాగరాజు, మాజీ కౌన్సిలర్‌, పుంగనూరు.

Tags: Bridges… Ruins…