లక్కిరెడ్డిపల్లి ముచ్చట్లు:
ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ SIR కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం లక్కిరెడ్డిపల్లి మండలంలోని కోనంపేట గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పోలింగ్ స్టేషన్ నెం. 8తో పాటు లక్కిరెడ్డిపల్లి టౌన్‌లోని పోలింగ్ స్టేషన్ నెం. 18ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న తీరు, హౌస్‌హోల్డ్ ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ, వాటి ప్రదర్శన, నమోదు ప్రక్రియలను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలో ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించ బడకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్ల వివరాలను సమగ్రంగా నమోదు చేయడంతో పాటు, కొత్తగా అర్హత పొందిన వారి పేర్లు చేర్చడం, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి వివరాలు, మరణించిన ఓటర్ల సమాచారాన్ని ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నమోదు చేయాలని సూచించారు.
సేకరించిన సమాచారాన్ని ఎలాంటి జాప్యం లేకుండా ఆన్‌లైన్‌లో డిజిటలైజేషన్ చేసి, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ఓటరు జాబితా ఖచ్చితత్వమే ఎన్నికల పారదర్శకతకు పునాదిగా నిలుస్తుందని పేర్కొంటూ, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తూ గడువులోగా అన్ని పనులను నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాలకు వచ్చే ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించి, ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఈ ప్రత్యేక అవకాశాన్ని వినియోగించుకొని తమ ఓటరు వివరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు, సవరణలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Tags: The District Collector inspected the intensive revision of the special electoral roll at the field level in Lakkireddypalli Mandal.