సైబర్ నేరాల బాధితులకు హోల్డ్ మనీ వాపస్ చేయుటకు ప్రత్యేక ప్రాధాన్యత.
అనకాపల్లిముచ్చట్లు:
అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రాబోవు తేదీ.11.07.2026 న జరగనున్న “జాతీయ లోక్ అదాలత్” లో ఇరు పార్టీలు వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే విధంగా ఉన్నతాధికారులతో మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమగ్ర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు మరియు ఆర్థిక సైబర్ నేరాల కేసుల పురోగతిని ఆయన పరిశీలించారు.
కేసుల పరిష్కారంలో 10% పెంపుదలే లక్ష్యం:
సమీక్షా సమావేశంలోజిల్లా ఎస్పీ మాట్లాడుతూ, గత లోక్ అదాలత్ ఫలితాల కంటే ఈసారి మెరుగైన ప్రదర్శన కనబరచాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసుల పరిష్కారాల సంఖ్యను కనీసం 10 శాతం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని స్టేషన్ల అధికారులు తమ పరిధిలోని అర్హత కలిగిన కేసులను గుర్తించి, ఇరు పక్షాల వారికి తగిన కౌన్సిలింగ్ నిర్వహించి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మరియు న్యాయ అధికారుల సమన్వయంతో కేసుల త్వరితగతిన పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఆర్థిక సైబర్ నేరాల కేసుల సమీక్ష – హోల్డ్ అమౌంట్ రికవరీ:
సైబర్ మోసాలకు గురై జిల్లాలోని బాధితులు నష్టపోయిన సొమ్మును పోలీస్ శాఖ వెంటనే స్పందించి వివిధ బ్యాంకు ఖాతాలలో ఫ్రీజ్/హోల్డ్ చేయించడం జరిగింది. సదరు హోల్డ్ చేయబడిన సొమ్మును చట్టపరమైన ప్రక్రియ ద్వారా బాధితులకు త్వరితగతిన తిరిగి అప్పగించేలా చర్యలు చేపట్టాలని, సైబర్ క్రైమ్ విభాగంతో సమన్వయపరచుకొని సంబంధిత ఎస్.హెచ్.ఓ లు చర్యలు చేపట్టాలన్నారు.
ఎస్పీ హెచ్చరిక:
జిల్లాలోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు మరియు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్లు ప్రతిరోజూ తమ పరిధిలోని కేసుల పురోగతిని పర్యవేక్షించాలన్నారు.ప్రజలు మరియు సుదీర్ఘకాలంగా కోర్టు కేసులతో ఇబ్బంది పడుతున్న ఇరు పక్షాల వారు ఈ లోక్ అదాలత్ ద్వారా ఉచితంగా, కోర్టు ఖర్చులు లేకుండా తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని జిల్లా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేయడమైనది.
Tags:District SP Tuhin Sinha reviews National Lok Adalat;