July 7, 2026
Explore
శాస్త్రోక్తంగా విజయవాడ ఎస్వీ ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

శాస్త్రోక్తంగా విజయవాడ ఎస్వీ ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

July 7, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

వార్షికోత్సవానికి ఆధ్యాత్మికంగా ముస్తాబైన ఆలయం

జూలై 8న జరగనున్న విజయవాడ శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ఆలయంలో అత్యంత పవిత్రమైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు.ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పవిత్ర కార్యక్రమంలో స్వామివారి గర్భాలయం, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర ఆలయంలోని అన్ని ప్రాంతాలను ముందుగా పరిశుభ్రమైన నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధపు పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షించి దివ్యంగా శుద్ధి చేశారు. తిరుమంజనం అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు.

జూలై 8న వార్షికోత్సవ మహోత్సవం

జూలై 8న ఆలయ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 7.20 గంటల నుండి మధ్యాహ్నం 1.45 గంటల వరకు అష్టోత్తర శతకలశాభిషేకం, మహాశాంతి హోమం, వర్షవర్ధన హోమం, మహాపూర్ణాహుతి, మహాస్నపనం తదితర విశిష్ట వైదిక కార్యక్రమాలను వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు.టీటీడీ ఆధ్వర్యంలో జరిగే ఈ మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని టిటిడి కోరుతోంది.ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ ఎం. మల్లికార్జున, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ లలిత రమాదేవి, అర్చకులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Tags: Koil Alwar Tirumanjanam performed according to scriptural norms at the Vijayawada SV Temple.