తిరుమల ముచ్చట్లు:
116 ఏళ్ల వయస్సులో కాలినడకన తిరుమలకు చేరుకున్న వృద్ధ భక్తురాలు
ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసిన టీటీడీ
శ్రీవేంకటేశ్వర స్వామివారిపై అచంచలమైన భక్తితో 116 ఏళ్ల వయస్సులో కాలినడకన తిరుమలకు చేరుకున్న తమిళనాడుకు చెందిన వృద్ధ భక్తురాలు నవనీతమ్మకు టీటీడీ సోమవారం ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసింది.
ఇటీవల కాలినడకన తిరుమలకు వెళ్తున్న నవనీతమ్మ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆమె భక్తికి పలువురు ప్రశంసలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ సోషియల్ మీడియా ఖాతాల్లో భక్తికి వయస్సు అడ్డురాలేదని, శ్రీవారిపై భక్తులకు ఉన్న విశ్వాసానికి ఈ వృద్ధురాలే నిదర్శనమని పోస్ట్ చేశారు.
ఈ క్రమంలో వృద్ధురాలు, ఆమె కుటుంబ సభ్యుల వివరాలు తెలియజేయాలని టీటీడీ చైర్మన్ ఆదివారం ఎక్స్ (X) వేదికగా విజ్ఞప్తి చేశారు. చైర్మన్ సూచనల మేరకు టీటీడీ విజిలెన్స్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి, తమిళనాడు చెన్నైకు చెందిన నవనీతమ్మను గుర్తించి వారిని సంప్రదించారు.
చైర్మన్ ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నవనీతమ్మతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు. టీటీడీ సిబ్బంది స్వయంగా ఆమెను బయోమెట్రిక్ కేంద్రం నుంచి దర్శనం వరకు వెంట ఉండి అన్ని ఏర్పాట్లు చేశారు.
అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర వృద్ధ భక్తురాలికి వేదపండితులతో వేదాశీర్వచనం చేయించి, పట్టువస్త్రం కప్పి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా నవనీతమ్మ మనవడు దిక్పతి మాట్లాడుతూ శ్రీవారి రూపంలో టీటీడీ అధికారులు తమ అమ్మమ్మతో పాటు కుటుంబ సభ్యులకు ఎంతో గొప్ప దర్శన భాగ్యాన్ని కల్పించారని ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు టీటీడీ సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.


Tags:Unwavering devotion to the Lord despite advancing age.