ఈ నెల 5 నుంచి 11వరకు కొరియా పర్యటన
అధికారిక సమావేశాలతోపాటు పెట్టుబడి చర్చలు
అమరావతిముచ్చట్లు:
భారత్ – దక్షిణ కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసేందుకు తమ దేశంలో పర్యటించాల్సిందిగా రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణ కొరియా) ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌ను ఆహ్వానించింది. వారి ఆహ్వానం మేరకు ఈనెల 5 నుంచి 11వతేదీ వరకు ఆరురోజులపాటు మంత్రి లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో మంత్రి లోకేష్ కొరియాలో వివిధ మంత్రిత్వశాఖల ప్రతినిధులతో అధికారిక సమావేశాల్లో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ అధికారిక సమావేశాలను నిర్వహిస్తున్నామని దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్ (చెన్నయ్) చాంగ్ న్యూన్ కిమ్ మంత్రి లోకేష్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇరుదేశాల నడుమ మరింత సహకారం, సంబంధాల బలోపేతం ఈ పర్యటన కీలక అడుగు కాగలదని భావిస్తున్నట్లు కిమ్ తెలిపారు.
ఈనెల 5వతేదీన దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో ఇండియా డయాస్పోరా ఆత్మీయ సమావేశానికి హాజరై అక్కడి భారతీయులు, తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 6వతేదీన దక్షిణ కొరియా టెక్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంతోపాటు వివిధ సంస్థలతో పెట్టుబడి చర్చల్లో పాల్గొంటారు. అనంతరం హ్యోసంగ్ భారీపరిశ్రమ సంఘం అధ్యక్షుడు టకేషి యొకోటా, సియోల్ సెమికండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ టేహ్యుంగ్ లీతో సమావేశమవుతారు. 7వతేదీన ఎల్జీ కెమ్ గ్లోబల్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్, ఎల్జీ ఓవర్ సీస్ కంపెనీస్ హెడ్ యున్ జు కోహ్ ఎల్జీ టవర్స్‌లో ఏర్పాటుచేసిన విందు సమావేశంలో పాల్గొంటారు. ఎల్జీ అనుబంధ సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు ఈ సమావేశానికి హాజరుకానున్నాయి. 8వతేదీన కొరియన్ మెరైన్ అక్విప్ మెంట్ అసోసియేషన్ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. 9వతేదీన కొరియన్ పొలిటికల్ ఎఫైర్స్ డిప్యూటీ మినిస్టర్ మిస్. యుయి-హే సిసిలియా చుంగ్ తో భేటీ అవుతారు. అనంతరం కొరియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ & ఇన్వెస్టిమెంట్స్ డిప్యూటీ మినిస్టర్ కాంచన్ కాంగ్ తో సమావేశమవుతారు. 10వతేదీన వివిధ సంస్థల ప్రతినిధులతో పెట్టుబడి చర్చలతోపాటు కొరియా ఆటో ఇండస్ట్రీ కోఆపరేషన్ ఏజన్సీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. అదేరోజు రాత్రి సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్–2026 విజయవంతం చేయాలని కోరుతూ కొరియా కంపెనీల ప్రతినిధులతో రోడ్ షోలో పాల్గొంటారు.
Tags: South Korea invites Minister Lokesh!