తిరుపతి ముచ్చట్లు:
- సైబర్ నేరాలు, సోషల్ మీడియా ప్రమాదాలపై సమగ్ర అవగాహన.
- మాదకద్రవ్యాలు, బాల్య వివాహాలు, మహిళలు–చిన్నారులపై నేరాల నివారణకు సూచనలు.
- క్రమశిక్షణ, నైతిక విలువలు, లక్ష్యంతో చదువే విజయానికి మార్గమని విద్యార్థులకు పిలుపు.
- విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన – బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా మహిళలు, యువత, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నివారణ, సామాజిక చైతన్యంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా శక్తి టీమ్ ఆధ్వర్యంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ తమీమ్ అహ్మద్ , మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ జగన్నాథం రెడ్డి , వన్ స్టాప్ సెంటర్ అధికారులతో కలిసి తారకరామ నగర్‌లోని శ్రీ చైతన్య పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శక్తి యాప్ వినియోగం, ఈవ్ టీజింగ్ నివారణ, మొబైల్ ఫోన్లు మరియు సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, గుర్తు తెలియని లింకులు, వీడియో కాల్స్, వ్యక్తిగత ఫోటోలు మరియు సమాచారం సోషల్ మీడియాలో పంచుకోవడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు, టీనేజ్ వయస్సులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మంచి స్నేహాలు, మంచి ప్రవర్తన, మంచి అలవాట్లు, అపరిచితుల పట్ల అప్రమత్తత, మొబైల్ గేమ్స్ వ్యసనం, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు.
అదేవిధంగా మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాలు, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, తప్పిపోయే చిన్నారులు, చిన్నారుల అపహరణ వంటి అంశాలను ఉదాహరణలు, కేస్ స్టడీల ద్వారా వివరించి, ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.
అలాగే క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, నైతిక విలువలు, చదువు ప్రాముఖ్యత, లక్ష్యంతో విద్యాభ్యాసం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించడం ద్వారా సమాజంలో ఉన్నత స్థానాన్ని సాధించవచ్చని విద్యార్థులకు తెలియజేశారు.
రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్–112, మహిళల సహాయానికి 181, చిన్నారుల రక్షణ కోసం 1098, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం 1930 హెల్ప్‌లైన్ నంబర్లను నిర్భయంగా వినియోగించాలని అధికారులు సూచించారు.విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకుని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి, సమాజ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, శక్తి టీమ్ సభ్యులు, వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Tags: Greater assurance of safety for women and youth with the Shakti app.