నేడు రాత్రి ధ్వజావరోహణం
తిరుపతి ముచ్చట్లు:
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం చక్రస్నానం వైభవంగా నిర్వహించారు. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరించారు.
ఉదయం స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించగా, అనంతరం పుష్కరిణి వద్ద శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం ఘనంగా చేపట్టారు. కంకణ బట్టార్ సూర్యకుమార్ ఆచార్యుల ఆధ్వర్యంలో విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ధూపదీప నైవేద్యం, రాజోపచారం తదితర వైఖానస ఆగమోక్త క్రతువులు నిర్వహించారు.
పాలు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, గంధంతో అభిషేకాలు నిర్వహించి, శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో స్నపనం చేశారు. ఈ సందర్భంగా ఉపనిషత్తులు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర వేదమంత్రాలను టీటీడీ వేదపారాయణదారులు పారాయణం చేశారు.
తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు సఫలమై లోకం క్షేమంగా ఉండాలని, భక్తులు సుఖశాంతులతో జీవించాలని సంకల్పించి చక్రస్నానం నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొనే భక్తులు సమస్త పాప విముక్తులై ధనధాన్య సమృద్ధిని పొందుతారనే విశ్వాసం ఉందన్నారు.
సాయంత్రం నవసంధి, మాడవీధి ఉత్సవాలు నిర్వహించనుండగా, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్ తదితరులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
Tags: Appalayagunta Brahmotsavams Conclude with Chakrasnanam