June 27, 2026
Explore
సింహవాహనంపై యోగనారాయణ స్వరూపంలో భక్తులను కటాక్షించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

సింహవాహనంపై యోగనారాయణ స్వరూపంలో భక్తులను కటాక్షించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

June 27, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

ధైర్యం, పరాక్రమం, ధర్మరక్షణకు ప్రతీకగా దివ్య వాహనసేవ

రాత్రి ముత్యపు పందిరి వాహనంపై మరో దివ్య దర్శనం

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు యోగనారాయణ స్వామి అలంకారంలో సింహవాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడవీధుల్లో జరిగిన వాహనసేవ భక్తిరసాన్ని పంచింది.

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి గోవింద నామస్మరణల మధ్య స్వామివారిని దర్శించుకుని పులకించిపోయారు.

సాయంత్రం 5 గంటలకు స్వామివారు ఊంజల్ మండపానికి వేంచేపు చేయగా, అనంతరం సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించనున్నారు.

సింహవాహన మహిమ

దుష్టశిక్షణ, శిష్టరక్షణ ధర్మాన్ని చాటిచెప్పే స్వామివారు సింహవాహనాన్ని అధిష్ఠిస్తారు. సింహం పరాక్రమం, ధైర్యం, తేజస్సు, నాయకత్వం, విజయస్ఫూర్తికి ప్రతీక. సింహదర్శనం ద్వారా భక్తుల్లో ఆత్మవిశ్వాసం, పట్టుదల, ధర్మనిష్ఠ పెంపొందుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తున్నాయి. అజ్ఞానాన్ని తొలగించి ధర్మమార్గంలో నడిపించే దైవసందేశాన్ని ఈ సింహవాహనోత్సవం ద్వారా స్వామివారు ప్రసాదిస్తున్నారని విశ్వసిస్తారు.రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు మరోసారి భక్తులకు దివ్య దర్శనమిచ్చి ఆశీర్వదించనున్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ వేణుగోపాల్, అర్చకులు, శ్రీవారి సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

Tags: Sri Prasanna Venkateswara blessed devotees while mounted on the Lion Vahanam, appearing in the form of Yoga Narayana.