June 27, 2026
Explore
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలి

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలి

June 27, 2026 | Andhra Pradesh

డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

రాయచోటి ముచ్చట్లు:

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నేడు, రేపు (జూన్ 27, 28 తేదీలలో) నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కలెక్టర్ శనివారం రాయచోటి పట్టణంలోని పోలింగ్ స్టేషన్ నెం.121 పరిధిలో సందర్శించారు.

రాయచోటి అర్బన్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్, బూత్ లెవల్ అధికారులతో (BLOలు) మాట్లాడి ఓటరు కార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ, ‘సర్’ ఏన్యుమరేషన్ ఫారాల పంపిణీ, నమోదు ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికుల ఇండ్ల వద్దకు వెళ్లి నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. వివిధ అంశాలను తీసుకోవాల్సిన చర్యలపై తగు సూచనలు జారీ చేశారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ…, జిల్లాలో ఓటరు జాబితాను మరింత ఖచ్చితంగా, సమగ్రంగా రూపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఇంటికి చేరుకుని అర్హులైన ప్రతి ఓటరికి సర్ ఏన్యుమరేషన్ ఫారాలను అందజేయాలని, ఓటర్ల వివరాలను సక్రమంగా సేకరించి వెంటనే ఆన్‌లైన్‌లో డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల కుటుంబ వివరాలు, నివాస స్థితి, కొత్తగా వచ్చిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు.

ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించి, వేగవంతంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు.

జిల్లాలో జరుగుతున్న ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో అన్ని బీఎల్ఓలు తమ పరిధిలో తప్పనిసరిగా అందుబాటులో ఉండి ఇంటింటికీ చేరుకుని ఫారాల పంపిణీ, వివరాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటరు వివరాలను సరిచేసుకోవడం, అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, తాసిల్దార్, బిఎల్వోలు తదితరులు పాల్గొన్నారు.

Tags: The special voter list revision program must be conducted effectively in the district.