June 25, 2026
Explore
రహదారుల నిర్మాణంపై కేంద్రమంత్రి కీలక ఆదేశాలు!

రహదారుల నిర్మాణంపై కేంద్రమంత్రి కీలక ఆదేశాలు!

June 25, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

  • దేశవ్యాప్తంగా రహదారుల అనుసంధానాన్ని పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ, జమ్మూ-కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
  • దేశంలో ప్రపంచ స్థాయి జాతీయ రహదారి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. తెలంగాణ, జమ్మూ-కాశ్మీర్, అలాగే లడఖ్‌ పరిధిలోని జాతీయ రహదారి ప్రాజెక్టుల పురోగతిపై ఆయన ఢిల్లీలో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లపై అధికారులు, నిర్మాణ సంస్థలతో నితిన్ గడ్కరీ సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సమీక్షలో ప్రధానంగా తెలంగాణలో నిర్మాణంలో ఉన్న 4,931 కి.మీ. జాతీయ రహదారులు, జమ్మూ-కాశ్మీర్‌లో నిర్మాణంలో ఉన్న 2,035 కి.మీ., లడఖ్‌లో నిర్మాణంలో ఉన్న 804 కి.మీ. రహదారి పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థలకు కేంద్ర మంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టుల నాణ్యత, నిర్వహణ, భద్రతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దీర్ఘకాలం మన్నికైన రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనే తమ దృష్టి ఉందని ఆయన పేర్కొన్నారు.

👉నాణ్యతతో పాటు గడువులోగా పూర్తి కావాలి

  • ప్రాంతీయ అనుసంధానాన్ని పెంపొందించడం, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడంలో జాతీయ రహదారులు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి, పనుల పర్యవేక్షణను మరింత బలోపేతం చేసి, నిర్దేశిత గడువులోపు ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. రహదారుల నిర్మాణంలో ఆధునిక సాంకేతికతలు, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అమలు చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆయన సూచించారు.

👉వర్షాకాలం వేళ అప్రమత్తత అవసరం

  • ప్రస్తుత వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, భారీ వర్షాలు కురిసే చోట్ల డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచాలని, కొండచరియలు విరిగిపడకుండా ముందస్తు నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే తక్షణమే స్పందించేలా ‘ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్స్’ను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిర్వహించిన ఈ కీలక సమీక్షతో తెలంగాణ, జమ్మూ-కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో నిలిచిపోయిన రహదారి పనులకు మోక్షం లభించడంతో పాటు, నిర్మాణ రంగంలో మరింత వేగం పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Tags: Union Minister issues key directives on road construction!