June 23, 2026
Explore
జల్సాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్..

జల్సాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్..

June 23, 2026 | Andhra Pradesh

రూ. 6.5 లక్షల విలువైన సొత్తు స్వాధీనం..

మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

మదనపల్లి ముచ్చట్లు:

క్రికెట్ బెట్టింగ్‌లు, జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో అంతర్రాష్ట్ర స్థాయిలో భారీ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక కరుడుగట్టిన దొంగను అన్నమయ్య జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. మంగళవారం మదనపల్లె ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కేసు వివరాలను వెల్లడించారు.

శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరంకు చెందిన షేక్ ఖజాపీర్ (30). వృత్తిరీత్యా పెయింటర్ అయిన ఇతనికి పెద్ద కుటుంబం ఉండటం, ఆదాయం చాలకపోవడంతో పాటు క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసై చోరీల బాట పట్టాడు.

జూన్ 23 ఉదయం చిన్నమండెం మండలం, వండాడి క్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు పట్టుబడ్డాడు.

రికవరీ చేసిన సొత్తు:
చిన్నమండెం, కలకడ, గుర్రంకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన రూ. 6 లక్షల విలువైన 42 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 50 వేల విలువైన 250 గ్రాముల వెండి వస్తువులు మరియు ఒక స్ప్లెండర్ ప్లస్ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నేర చరిత్ర: నిందితుడిపై గతంలో అనంతపురం జిల్లాలో 20, కర్ణాటకలో 10, అన్నమయ్య జిల్లాలో 10 పాత కేసులు ఉన్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో నమోదైన 7 కేసుల్లో ఇతనే ప్రధాన ముద్దాయి.

ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పలు కీలక సూచనలు చేశారు..

యువత క్రికెట్ బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ జూదాలు వంటి జల్సాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దు. సులభంగా డబ్బు సంపాదించాలనే అత్యాశ నేరాల వైపు అడుగులు వేయిస్తుంది.

వేసవి సెలవులు లేదా ఇతర పనుల నిమిత్తం ఇళ్లకు తాళాలు వేసి ఊరెళ్లేవారు తప్పనిసరిగా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.

దొంగతనాలను నివారించడానికి ప్రతి కాలనీ, వీధుల్లో, వ్యాపార సముదాయాల వద్ద ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

మీ పరిసరాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా తిరుగుతున్న వారు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా అత్యవసర నంబర్ డయల్ 112 కు సమాచారం అందించాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము.

ఈ కేసును విజయవంతంగా ఛేదించి, నిందితుడిని పట్టుకోవడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్, సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, రూరల్ ఇన్‌స్పెక్టర్ ఎస్.కె. రోషన్, చిన్నమండెం ఎస్ఐ వి. సుధాకర్ తదితర పోలీస్ సిబ్బందిని క్రైమ్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Tags: Interstate thief arrested for committing thefts to fund a lavish lifestyle.